బాబు ముందు మోడీ తగ్గాల్సిందేనా!

 

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయన్న సామెత అన్ని విషయాల్లో ఏమో కానీ...రాజకీయాల్లో మాత్రం నిజమని నమ్మల్సి ఉంటుంది కొన్ని పరిస్థితులు చూస్తుంటే. గుజరాత్ ఎలక్షన్ ఫలితాలు చూస్తుంటే అలానే ఉంది. నిన్న మొన్నటివరకూ అధికారంతో ఎగిసిపడ్డ బీజేపీ ఒక్కసారిగా గుజరాత్ ఫలితాలు చూసిన వెంటనే.. గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాంకేతికంగా అయితే గెలిచారు కానీ... మానసికంగా మాత్రం బీజేపీ ఓడిపోయింది. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే గెలిచిన ఆనందం అంతగా కనిపించడంలేదు.

 

ఉత్తర భారతదేశంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో దాదాపు ఘన విజయం సాధించి బీజేపీకి తిరుగులేదనిపించింది. కానీ గెలిచినా ఒక్క గుజరాత్ ఫలితాలు మాత్రం మోడీ పూసాలు ఒక్కసారిగా కదిలించింది. తన సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లోనే బీజేపీ చ‌చ్చీ చెడీ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని బట్టి మోడీకి పరిస్థితి ఏంటో అర్ధమైపోయి ఉంటది. ఇక పంజాబ్‌లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ చావు దెబ్బ‌తింది. రేపు క‌ర్ణాట‌క‌లోనూ ఇదే కొనసాగే పరిస్థితి.

 

మరి ఇప్పటివరకూ దక్షిణ భారత దేశంపై తమ పెత్తనాన్ని చూపిస్తూ... చిన్న చూపు చూస్తున్న మోడీపై గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం పడుతుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ పేరు చెపితే ఒక్క క‌ర్ణాట‌క‌లో మిన‌హా మ‌రే రాష్ట్రంలోను ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇక తెలంగాణ‌లో ఇప్పుడున్న ఐదు ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టుకునే ప‌రిస్థితి లేదు. ఇక త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం అక్క‌డ రాజ‌కీయాల మ‌ధ్య వైష‌మ్యం క్రియేట్ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలను త‌మిళ జ‌నాలు తీవ్రంగా వ్య‌తిరేకించారు.

 

అన్నింటికంటే ముఖ్యంగా... ఏపీలో టీడీపీ లేక‌పోతే బీజేపీ లేనట్టే.. అది అందరికీ తెలిసిందే. ఏదో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ నాలుగు సీట్లు అయినా వచ్చాయి కానీ.. లేకపోతే బీజేపీకి అంత సీన్ లేదు. ఏదో ఈ మధ్య సౌత్ లో గెలిచినందుకు కాస్త రెచ్చిపోయారు. దానికి నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచి బాబు గట్టిగా సమాధానం చెప్పారు. దాంతో బీజేపీ తోక ముడిచింది. మిత్రపక్షలన్న పేరుకే కానీ... తమ అధికార అహంకారంతో మిత్ర‌ప‌క్షాలను కూడా అణ‌గ‌దొక్కే ప్రయత్నం చేశారు ఇప్పటివరకూ. ఇక గుజరాత్ దెబ్బ‌తో ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవని తేలిపోతుంది. మోడీ ఏపీలో చంద్ర‌బాబు లాంటి న‌మ్మ‌క‌మైన మిత్రుల‌కు జీ హుజూర్ అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. పోనీలే అని ఎన్ని విమర్శలు చేసినా.... ఏం మాట్లాడకుండా ఉంటున్న చంద్రబాబుది చేతకాని తనంగా చూస్తున్నారు... సోము వీర్రాజు లాంటి వాళ్లు. ఏదో చచ్చీ చెడీ గెలిచినా.. తామేదో ఘన విజయం సాధించినట్టు మాట్లాడే సోము వీర్రాజు లాంటి నోళ్లకి ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ తాళం వేయకపోతే... భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మరి. మొత్తానికి గుజరాత్ మోడీ తలరాతనే మార్చేలా కనిపిస్తోంది. చూద్దాం... ముందు ముందు ఏం జరుగుతుందో...