నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-6ఏ


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపించింది. జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08.. భారత్‌ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దది. 2015లో ప్రయోగించిన జీశాట్-6 ఉపగ్రహ వ్యవస్థలో ఇది రెండోది. దీని ద్వారా కమ్యూనికేషన్ల రంగంలో భారత్‌ కొత్త పుంతలు తొక్కనుంది. ఈ శాటిలైట్ ద్వారా అందుబాటులోకి వచ్చే ‘మల్టీ బీమ్‌ కవరేజీ’ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ కమ్యూనికేషన్‌‌ వ్యవస్థ మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా భారత భద్రతా దళాలకు ఇది విశేషంగా దోహదపడనుంది.