అయోమయ అగ్నిలో బ్రిటన్! గందరగోళపు మంటల్లో లండన్!

   

 

మనుషులకు గుడ్ టైం, బ్యాడ్ టైం వున్నట్టు దేశాలకు, ప్రాంతాలకు, నగరాలకు కూడా వుంటాయా? ఏమో… లండన్ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది! లండన్ కి ఇప్పుడు రియల్ బ్యాడ్ టైం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రవాదులు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరోవైపు మానవ తప్పిదాలు కూడా ఇంత కాలం మాటు వేసి ఇప్పుడు కాటు వేస్తున్నాయి! లండన్ నడిబొడ్డులో తగలబడిన బహుళ అంతస్థుల భవనం ఆ నగరం తాజా దుస్థితికి నల్లటి మసైపోయిన విషాద చిహ్నం!

 

మధ్య లండన్ లో వున్న గ్రెన్ ఫెల్ టవర్ 24అంతస్థుల భవనం. పూర్తిగా జనం తలదాచుకునే రెసిడెన్షియల్ కాంప్లెక్స్. 120ఫ్లాట్లలో దాదాపు 500 మందికి పైగా జనం అందులో వుంటున్నారు. కాని, చూస్తుండగానే చిన్న నిప్పు రవ్వ మంటైంది. మంట పెద్ద అగ్ని జ్వాలలుగా మారింది. మొత్తం బిల్డింగ్ నే కరిగించి మింగేసింది. అగ్ని ప్రమాదం మొదలైన నిమిషాల్లోనే ఫైరింజన్లు వచ్చినా ఏం లాభం లేకుండా పోయింది. 200 మంది ఫైర్ ఫైటర్లు ప్రాణాలకు తెగించి బిల్డింగ్ లోకి వెళ్లినా… అనేక మంది మాడి మసైపోయారు. ఎంతో మందో ఇంకా ఖచ్చితంగా తెలియదు!

 

నా 29ఏళ్ల కెరీర్లో ఇంతటి దారుణమైన కార్చిచ్చుని ఎప్పుడూ చూడలేదు అని లండన్ ఫైర్ కమీషనరే స్వయంగా చెప్పారంటే… జరిగిందేంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… ఓ తల్లి ఏమీ చేయలేక తన చంటి బిడ్డని పై నుంచి కిందకి విసిరేసిందట! ఎవరైనా పట్టుకుంటారన్న ఆశతో! కాని, అలాంటిదేం జరగలేదు. ఇంకో అంతస్థులోని మూసి వున్న కిటీకీల్లోంచి చిన్న పిల్లలు తలుపుల్ని భయంతో బాదుతూ వుండటం కనిపించింది! కాని, అది కొంతసేపే! చూస్తుండగానే ఆ పిల్లల్ని వెనక నుంచి కమ్ముకొచ్చిన నల్లటి పొగలు మింగేశాయి! అగ్ని ఆ అంతస్థు మొత్తాన్నీ బూడిద చేసేసింది! ఇలాంటి హృదాయ విదారక సన్నివేశాలు ఎన్నెన్నో!

 

24అంతస్థుల ఆకాశహర్మ్యంలోని ఒక ఫ్లాట్ లో పాత ఫ్రిడ్జ్ పేలిపోయి మంటలు చెలరేగటం… అవ్వి కణాల్లో మొత్తం బిల్డింగ్ నే బూదిద చేయటం… ఎవ్వరూ ఊహించని ప్రమాదమేం కాదు. భారీ బంగలాల విషయంలో ప్రమాదం అంటూ జరిగితే ఇలానే వుంటుంది విషాదం. ఎక్కడైనా కూడా! కాని, లండన్ లాంటి ఒక ప్రపంచపు మేటి నగరంలో, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశపు రాజధానిలో వందల మంది ప్రాణాలు ఎప్పుడో 1974లో కట్టిన స్కై స్కేపర్లో వుంచి ప్రభుత్వాలు చోద్యం చూస్తాయా? ఇప్పుడు ఇదే అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటి బ్రిటన్ లో ప్రజాల సంక్షేమం పరమ దారుణంగా వుందనేది స్పష్టంగా తేలిపోతోంది రోజు రోజుకి! అదే తాజా ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించింది. ఎవ్వరికీ స్పష్టంగా మద్దతు పలకలేదు జనం. ఎవ్వర్నీ నమ్మటం లేదు వారు. దశాబ్దాల కిందట కట్టిన బిల్డింగ్ భద్రతనే చూసుకోని బ్రిటన్ ప్రభుత్వాలు, ఇంక ఉగ్రవాద దాడుల్ని ఏం అరికడతాయి? ఇప్పుడు లండన్ వాసులు, బ్రిటన్ ఓటర్ల మనసుల్లోని సంశయం ఇదే! సహజంగా ఇలాంటి పరిస్థితి ఏ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల పౌరులకి వుంటుంది. కాని, రాను రాను యూరోపియన్ దేశాల రాజకీయ వ్యవస్థల్లోనూ తేడా కొల్టొచ్చినట్టు కనిపిస్తోంది.

 

మంటల్లో తగలబడ్డ భవనం లండన్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోనిది. అక్కడ సెలబ్రిటీలు, సంపన్నులు చాలా మంది వుంటారు. వాళ్ల ఊడిగానికి ఎంతో ఆసక్తి చూపే లండన్ పురపాలక సంఘాలు తమను మాత్రం పట్టించుకోవటం లేదని అంటున్నారట స్థానిక సామాన్య జనం. మంటల్లో బూడిదైన గ్రెన్ ఫెల్ టవర్ తక్కువ ఆదాయం వున్న వారు వుండేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ సబ్సిడి భవనం లాంటిది. అందుకే, సంవత్సరాల తరబడి ఆ పాత భవనం భద్రతపై జనం ఆందోళన వ్యక్తం చేసినా, కంప్లైంట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదట! చివరకు, పరమ దారుణమైన విషాదం జరిగిపోయింది. అందుకే, లండన్ లోని ఒక స్థానికుడు … సంవత్సరానికి పదివేల పౌండ్ల కంటే తక్కువ సంపాదించేవాడు, ఈ నగరంలో అసలు మనిషిగా బతకనే బతకలేడు అని వాపోయాడట!

 

కేవలం ఒక్క అగ్ని ప్రమాదం బ్రిటన్ లాంటి అగ్ర దేశం దుస్థితికి అద్దం పడుతుందని మనం చెప్పలేం. కాని, వరుసగా జరుగుతోన్న ఉగ్రవాద దాడులు, ఎన్నికల్లో వస్తోన్న గందరగోళ ఫలితాలు, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకి వచ్చేయటం, స్కాట్లాండ్ లో విడిపోతామంటూ ఉద్యమాలు రేగుతుండటం… అన్నీ తెల్లవారి దేశంలో ఏదో నల్లటి కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ముందు ముందు మరింత స్పష్టత రావచ్చు. కాని, ఇప్పటికైతే… తప్పంతా బ్రిటన్ ని ఏలుతూ వచ్చిన పాలకుల వైపే కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించిన బ్రిటన్ ప్రధానులు తమ స్వంత దేశంపై తగినంత శ్రద్ధ చూపలేదని అనిపిస్తోంది!