ఇది తాగితే ఆరోగ్యమే

 

 

చల్లటి కాలంలో వేడి వేడి ‘‘టీ’’ గొంతులోంచి జారుతుంటే ఎంత హాయిగా వుంటుందో కదా.. నిజమే! అయితే ఈసారి ఓ చిన్న మార్పు చేసి చూడండి. హాయితోపాటు ఆరోగ్యం కూడా మీ స్వంతం అవుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన అధ్యయనకర్తలు. అదే మామూలు టీ బదులు గ్రీన్ టీ తాగడం. ఎందుకు అంటే... బోల్డన్ని లాభాలు ఉన్నాయట మరి. అవేంటో చూద్దామా...

1. గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నిరోధానికి పనికొచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ (ఎపిగాల్లో కొటెచిన్) గ్రీన్ టీలో ఉన్నాయి.

2. ఇక మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.  బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ టీ మంచి మందు. ఎందుకంటే, చక్కగా కేలరీలను ఖర్చు చేస్తుంది. పొట్ట ప్రాంతంలో నిల్వ వుండే కొవ్వును కరిగిస్తుంది.

3. పిల్లలకి రోజూ ఓ కప్పు గ్రీన్ టీని తాగిస్తే దంత సమస్యలు దూరమవుతాయి. బ్యాక్టీరియాను నిర్మూలించే సుగుణాలు అందులో వున్నాయి.

4. డయాబెటిక్ పేషెంట్లు రోజూ రెండు కప్పులు అయినా గ్రీన్ టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో వుంచే గుణం దీనికి వుందని అధ్యయనాల్లో తేలింది.

5. రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, కాలేయానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి తప్పించుకోవాలన్నా రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీ అయినా తాగి తీరాల్సిందే.

6. ‘‘అంతెందుకు చెప్పండి... ఒక్క సంవత్సరం పాటు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగి చూడండి. అధిక రక్తపోటు సుమారు 46 శాతం తగ్గడం మీరే గమనిస్తారు’’ అంటున్నారు అధ్యయనకర్తలు.
 
ఇన్ని సుగుణాలు ఉన్నాయని తెలిశాక గ్రీన్ టీ తాగకుండా ఉండగలమా? అయితే ఒక్కటే సమస్య. మనం అన్ని విషయాలూ తెలుసుకుంటాం. కానీ, ఆచరించడం మర్చిపోతాం. ఈసారి అలా కాదు. రాయడం అవ్వగానే నేను, చదవడం అవ్వగానే మీరు వెంటనే ఓ కప్పు గ్రీన్ టీని వేడివేడిగా తాగేద్దాం... ఏమంటారు?


- రమ