సంజయ్ నై.. కిషన్ సై! బీజేపీలో ఏం జరుగుతోంది? 

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందా? జనసేనతో పొత్తు కొందరికి ఇష్టం లేదా? పవన్ తో చర్చలకు ఆయన ఎందుకు వెళ్లలేదు? గ్రేటర్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండగా బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పొత్తు విషయంలో పార్టీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడంపై బండి సంజయ్ ఓ అభిప్రాయంతో ఉండగా కిషన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య సఖ్యత లేదని. నగర సీనియర్ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు.

జనసేనతో పొత్తు విషయంలో బండి సంజయ్ కు ఇష్టం లేకున్నా కిషన్ రెడ్డి చొరవ తీసుకుని పవన్ కల్యాణ్ తో మాట్లాడరనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే శుక్రవారం రోజంతా హైదరాబాద్ లోనే 
ఉన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ మాజీ నేత సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలతోనూ సంజయ్ మంత్రాంగం జరిపారని చెబుతున్నారు. హైదరాబాద్ లోనే ఉన్నా పవన్ కల్యాణ్ తో చర్చలకు సంజయ్ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తు ఇష్టం లేదు కాబట్టే.. పవన్ దగ్గరకు బండి వెళ్లలేదని చెబుతున్నారు. అంధ్రా పార్టీగా ముద్రపడిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే గ్రేటర్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అందుకే బండి సంజయ్ జనసేన విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన పొత్తుపై మొదటి నుంచి తీవ్ర గందరగోళం నడిచింది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ..అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు 
చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ లో పోటీ చేయడానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపిన జనసేన.. పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది. సొంతంగానే పోటీ చేస్తామని బయటికి చెబుతూనే... బీజేపీతో పొత్తుకు జనసేన నేతలు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని డివిజన్లు ఇవ్వాల్సి వస్తుందని. దాంతో పార్టీలో అసంతృప్తి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భావించారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని ఆయన ప్రకటించారు. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటన తర్వాత కూడా గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై  పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్.. జనసేనతో పొత్తు సమస్యే లేదని తేల్చి చెప్పారు. 

బండి సంజయ్ పొత్తు లేదని రెండోసారి స్పష్టం చేయడంతో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భావించారు. అయితే శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. జనసేన పొత్తు మేటర్ లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంటరయ్యారు. పార్టీ మరో ముఖ్య నేత లక్ష్మణ్ తో కలిసి వెళ్లి ఆయన పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా పవన్ ను ఒప్పించారు. కిషన్ రెడ్డి తో సమావేశం తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల తీరుతో బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొన్నదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికలోనూ సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరిగాయంటున్నారు. బంజారాహిల్స్, కూకట్ పల్లి ప్రాంత నేతలు కొందరు కిషన్ రెడ్డిపై బహరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జీహెచ్ఎంసీలోనూ పాగా వేస్తామనే ధీమా కమలనాధుల్లో పెరిగిందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. నగర కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నేతలు, టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి  పోటీ 
చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్ నుంచి 10 నుంచి 10 మంది టికెట్ కోసం పోటీ పడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ లో దాఖలైన నామినేషన్లలోనూ అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ పేరుతో వేసినవే ఎక్కువగా ఉన్నాయి. ఇంత వరకు  బాగానే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల తీరే గందరగోళంగా మారిందని తెలుస్తోంది. ముఖ్య నేతల తీరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే ఆందోళన కమలం కేడర్ లో కనిపిస్తోంది.