శ్రమ విలువ...

అతనో నిరుద్యోగి. జీవితంలో ఎన్నోకష్టనష్టాలను చూసిచూసి ఎలాగొలా ఓ డిగ్రీని సంపాదించుకున్నవాడు. ఇంతగా కష్టపడిన తరువాత బతుకులో నిలదొక్కుకునేందుకు ఏదన్నా ఆసరా వస్తుందనే ఆశతో బతుకుతున్నవాడు. అలాంటి నిరుద్యోగి ఓ కంపెనీలో ఉద్యోగానికని బయల్దేరాడు. అవడానికి నిరుద్యోగే అయినా అతని ప్రతిభలో ఎలాంటి లోటూ లేదు. అందుకనే కంపెనీ వాళ్లు పెట్టిన ప్రతి పరీక్షలోనూ సునాయాసంగా నెగ్గాడు. ఆఖరి ఘట్టమైన ఇంటర్వ్యూకి ఎంపికైన అతికొద్ది మందిలో నిలిచాడు.

 

నిరుద్యోగి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే ఎదురుగుండా ఉన్న కుషన్‌ కుర్చీలో ఓ ముసలాయన కూర్చుని కనిపించాడు. ఆయన నిరుద్యోగి సర్టిఫికెట్లన్నీ పరిశీలిస్తూ- ‘మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని అడిగాడు.
‘నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండీ. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి.

‘ఓహ్‌! మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?’ ఆసక్తిగా అడిగాడు పెద్దాయన.
‘మా అమ్మ బట్టలు కుడుతూ ఉంటుందండి. అలాగే నన్ను ఇంతటివాడిని చేసింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి.
‘అవునా. గొప్ప విషయమే! ఏదీ నీ చేతులని ఓసారి చూపించు,’ అన్నాడు పెద్దాయన.

 

పెద్దాయన మాటల్లోని ఆంతర్యం నిరుద్యోగికి అర్థం కాలేదు. అయినా తన చేతులని ఆయన ముందర ఉంచాడు. అతని చేతులు చాలా మృదువుగా ఉన్నాయి. దూదిలాగా మెత్తగా, తెల్లగా ఉన్నాయి. ‘అదేంటీ! నువ్వెప్పుడూ మీ అమ్మగారి పనిలో సాయపడినట్లు లేదే!’ నిరుద్యోగి మృదువైన చేతులని చూసి అడిగాడు పెద్దాయన.

 

అప్పుడు అర్థమైంది నిరుద్యోగికి, పెద్దాయన చేతులని ఎందుకు చూపించమన్నాడు. ‘లేదండీ! మా అమ్మకి ఎప్పుడూ సాయపడేవాడిని కాదు. నా చదువులోనే కాలం గడిచిపోయింది. ఎప్పుడన్నా తనకి సాయపడతానని ముందుకు వచ్చినా కూడా ఆమె ఒప్పుకొనేది కాదు,’ అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు నిరుద్యోగి.

 

‘సరే ఒక చిన్న పని చేయి. ఇవాళ ఇంటికి వెళ్లినవెంటనే మీ అమ్మగారి చేతులు శుభ్రంగా కడుగు. ఆ పని చేశాక నీకెలా అనిపించిందో రేపు వచ్చి నాతో చెప్పు,’ అన్నాడు పెద్దాయన.

 

పెద్దాయన మాటలకి నిరుద్యోగి అయోమయంలో పడిపోయాడు. ఆ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో తనకి ఆర్థం కాలేదు. అయినా తప్పదు కాబట్టి ఆ రోజు ఇంటికి వెళ్లిన వెంటనే తన తల్లి దగ్గర కూర్చున్నాడు. ‘ఇవాళ ఓసారి నీ చేతులని శుభ్రంగా కడగాలని ఉందమ్మా!’ అన్నాడు. పిల్లవాడి చర్యలో ఆంతర్యం అర్థం కాకపోయినా, అతని మీద ప్రేమతో ఊరుకుంది తల్లి. వెంటనే తల్లి చేతులను తన చేతులలోకి తీసుకుని చూసుకున్నాడు నిరుద్యోగి. ఆశ్చర్యం! ఆ చేతులు తన చేతుల్లాగా మృదువుగా లేవు, తెల్లగానూ లేవు. ఆ చేతుల నిండా సూదిగాట్లు! బట్టలు కుట్టీకుట్టీ ఆ చేతులు బండబారిపోయాయి. నిలువెల్లా గీతలతో రాటుదేలిపోయాయి. వాటిని ఎంతగా కడిగినా కూడా ఆ గీతలు కొంచెం కూడా చెరగలేదు.

 

తల్లి చేతులని చూసిన నిరుద్యోగి నోట మాట రాలేదు. ఆ మర్నాడు అతను ఆ పెద్దాయన ఆఫీసులోకి అడుగుపట్టే వరకు కూడా అతని కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి.
‘ఏమైంది అలా ఉన్నావు. నేను చెప్పిన పని చేశావా!’ అని అడిగాడు పెద్దాయన. ‘చేశాను సర్‌,’ అన్నాడు నిరుద్యోగి సిగ్గుపడుతూ.
‘నీ తల్లి చేతులని చూసినప్పుడు నీకు ఏమర్థమయ్యింది!’ అని అడిగాడు పెద్దాయన.

 

‘ఇల్లు గడిచేందుకు నా తల్లి తన వంతు బాధ్యతగా కష్టపడుతోంది అనుకునేవాడిని కానీ, ఆ బాధ్యతని నెరవేర్చడంలో ఆమె శ్రమ ఏపాటిదో గ్రహించలేకపోయాను. తన జీవితం ఎంతగా రాటుదేలిపోయిందో నిన్నటివరకూ నాకు అర్థం కానే లేదు. నేను ఎంత ఎదిగినా కూడా తన త్యాగాన్ని మర్చిపోలేదు. ఆమెని ఎంత గొప్పగా చూసుకున్నా కూడా ఆమె పట్ల మేలుని తీర్చుకోలేను,’ అని చెప్పుకొచ్చాడు నిరుద్యోగి.

 

‘నీకు కష్టం విలువ, కృతజ్ఞత విలువ తెలియాలనే ఆ పని చెప్పాను. నీలో స్వార్థముంటే కనుక నీ తల్లి త్యాగం ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. నీ తల్లే కాదు... ఈ ప్రపంచంలో శ్రామికులంతా తమ కుటుంబం ముందుకు సాగేందుకు శ్రమిస్తూ రాటుదేలిపోతున్నారు. నువ్వు ఉద్యోగంలో ఎంత ఎదిగినా కూడా వాళ్ల శ్రమని గౌరవించే మనస్తత్వం ఉండాలి. ఆ తత్వం నీలో ఉందని అర్థమైంది. మున్ముందు దానిని నిలుపుకుంటావన్న ఆశా ఉంది. నువ్వు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావు,’ అంటూ చిరునవ్వుతో చెప్పాడు పెద్దాయన.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.