గవర్నర్ దూకుడుతో టీఆర్ఎస్ కు కష్టాలు.. మరో సచివాలయంగా మారుతున్న రాజ్ భవన్!!

 

తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడు పెంచారు. సమస్యలపై ప్రభుత్వ పెద్దల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే వారిని నిరాశ పరచడం లేదు, భరోసా ఇచ్చి పంపుతున్నారు. ప్రజా దర్భార్ నిర్వహించబోతున్నారు, తండాల్లో బసకు రెడీ అవుతున్నారు. తమిళిసాయి ఇంత చురుగ్గా వ్యవహారాలు చక్కబెట్టేందుకు కారణమేంటి. తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడులో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజ్ భవన్ లో రెస్ట్ తీసుకోవడానికి గవర్నర్ గా రాలేదని చాలా స్వల్ప కాలంలోనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్ వచ్చీ రాగానే తెలంగాణా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు సమయం కేటాయించారు. ఆ తర్వాత మెల్లగా తనదైన పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారు అందుకే ముందు యూనివర్సిటీలపై దృష్టి పెట్టారు. తొలుత వర్సిటీల స్థితిగతులపై సమీక్ష చేశారు, కీలకమైన సూచనలు చేశారు.

అప్పుడే తమిళసాయి తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. దీన్ని గవర్నర్ నిజం చేస్తున్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రాజ్యాంగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణాలో ఏర్పడ్డాయి. ఈ విషయంలో తమిళసాయి మొహమాటాలకు పోలేదు, అలాగని వివాదమూ చేయదలచుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఆమె పరిస్థితుల్ని కొన్నాళ్లు పరిశీలించిన తరువాతే రంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం, పిలిచి చర్చిస్తే పరిష్కారమయ్యే సమస్యను ప్రభుత్వమే కావాలని పెద్దది చేస్తోందన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే తమిళసాయి నివేదికతో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ పరిస్థితుల్ని ప్రధాని, హోంమంత్రికి వివరించారు, వారి సలహాలు, సూచనలు తీసుకుని తిరిగి వచ్చారు. వెంటనే ఆర్టీసీ అధికారులని పిలిపించి మాట్లాడారు, రవాణా మంత్రికి ఫోన్ చేశారు, సమ్మె విషయంలో తనకు వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ లు సమ్మెకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు, దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్న ఆందోళన ప్రజల్లో ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వం చర్చలు జరపటం లేదు, ఇక ప్రైవేటు క్యాబ్ ఆపరేటర్ లతో చర్చలు జరిపే ప్రసక్తే ఉండదు. ఈ విషయం గవర్నర్ ముందుగానే ఊహించి క్యాబ్ డ్రైవర్ సంఘ నేతలను పిలిపించి మాట్లాడారు, సమ్మెను విరమింపజేశారు. దాంతో ప్రజలు కాస్త రిలీఫ్ గా ఫీలయ్యారు, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు, కార్మికులకు భరోసా ఇస్తున్నారు. కీలకమైన అంశాల్లో మాత్రమే కాదు ప్రజా సమస్యల విషయం లోనూ తమిళసాయి దూకుడుగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ లోని పద్మాలయ, అంబేద్కర్ నగర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు ఆక్రమణకు గురైంది. దీనిపై ఆయన ప్రభుత్వ విభాగాలన్నింటికి ఫిర్యాదు చేశారు కానీ, ప్రయోజనం లేకపోయింది. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ప్రయోజనం లేకపోయింది.

దాంతో ఆయన గవర్నర్ కు ట్వీట్ ద్వారానే ఫిర్యాదు చేశారు, వెంటనే గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాదు వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించారు కూడా. దీంతో గవర్నర్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ప్రజా దర్బార్ ను కూడా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవ్వనుంది. కొత్తగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తండాలో ఒక రోజు బస చేయనున్నారు, రాజ్ భవన్ లో గిరిజన సంక్షేమ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు అన్నింటి లోనూ తనదైన ముద్ర వేసేందుకు తమిళసాయి ప్రయత్నిస్తున్నారు. 

తమిళసాయి గత గవర్నర్ నరసింహన్ లా బ్యూరోక్రాట్ కాదు, ఆమె ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్. బీజేపీకి ఏమాత్రం బేస్ లేదని భావించే తమిళనాడులో ఆ పార్టీని నడిపించిన నేత. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు, రాజకీయాలు ఎలా చేయాలో ఆమెకు ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని చేతల ద్వారానే చూపిస్తారని అంటున్నారు. నిజానికి గవర్నర్ కు ఇంత ఛాన్స్ ఇస్తోంది తెలంగాణా ప్రభుత్వమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రజలకు ఎప్పుడో దూరమైందనే విమర్శలు ఉన్నాయి, ప్రగతి భవన్ ఛాయలకు సామాన్యులకు ప్రవేశం ఉండదు. సచివాలయం ఇపుడు ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఈ విషయంలో అధికారులకే అంతంత మాత్రం క్లారిటీ ఉంది, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పోగుబడిపోతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం కూడా తగ్గిపోతోంది, ఈ కారణంగా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వారి కోసం చూస్తున్నారు.

వారికిప్పుడు గవర్నర్ రూపంలో ఓ అవకాశం దొరికిందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. తమిళసాయి ప్రజల అంచనాలను గుర్తించినట్లే ఉన్నారు అందుకే దూకుడుగా వెళుతున్నారు. ఇప్పుడున్న వేగంలోనే తమిళసాయి విధులు నిర్వహిస్తే రాజ్ భవన్ త్వరలో మరో సచివాలయంగా గుర్తింపు పొందినా ఆశ్చర్యం ఉండదంటున్నారు. గత గవర్నరుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ప్రభుత్వానికి ప్రస్తుత గవర్నర్ తీరు మింగుడుపడని అంశమే కానీ, వ్యతిరేకించలేని పరిస్థితి. గవర్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభిస్తే అది రాజకీయంగా మారిపోతోంది, ఈ అడ్వాంటేజ్ కూడా తమిళిసాయికి బాగానే ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది.