మహా ట్విస్ట్... రాష్ట్రపతి పాలన కోరుతూ కేంద్రానికి గవర్నర్ లేఖ

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగతసింగ్ కోషియారి కేంద్రానికి సిఫార్సు లేఖ రాశారు. ట్విస్ట్ లు అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర పాలిటిక్స్ అంచనాలకు అందడం లేదు. ఉదయం నుండి చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలతో క్షణక్షణం ఉత్కంఠత తలపించింది. ప్రభుత్వం అసలు ఏర్పాటవుతుందా..! లేదా రాష్ట్రపతి పాలనే శరణ్యమవుతుందా..! అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ఎన్సీపీకి మద్దతిచ్చే విషయం పై కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే ఎన్సీపీ నేతలు కూడా సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. సర్కార్ ఏర్పాటు ఆలస్యం అవ్వడానికి తాము ఏమాత్రం కారణం కాదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

మహారాష్ట్ర పగ్గాలు అసలు పవార్ చేతికందేనా సీఎం కుర్చి ఎవరిని వరిస్తుంది..గవర్నర్ పిలిచినట్టుగా ఎన్సీపీ సర్కారు కొలువు తీరుతుందా.. సేన సహకారం ఎన్సీపీకి ఎంత వరకు లభించనుంది. ఈ ప్రశ్నలన్నీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపాయి. అయితే మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గడువులోపు శివసేన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో ఎన్సీపీకి ఆహ్వానం పంపారు గవర్నర్. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ఎన్సీపీకి ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నర వరకు గడువిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా నెలకొన్న ఉత్కంఠత. సీఎం పీఠమే తమ టార్గెట్ గా ముందుకెళుతున్న శివసేన ప్రస్తుతం ఎన్సీపీకి మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన మరి ఎన్సీపీతో ఎలా చేతులు కలుపుతుందన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్సీపీకి మద్దతుపై శివసేన నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 

మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సైతం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని ఎన్సీపీ, శివసేన చెరో సగం పంచుకున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 50-50 ఫార్ములాకు నో చెప్పడంతో దశాబ్దాలుగా బీజేపీతో కొనసాగుతున్న స్నేహాన్ని సైతం వదులుకుంది శివసేన. శివసేన అభ్యర్థి సీఎం కావడమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీకి దూరమైన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలకు దగ్గరైంది. గవర్నర్ పిలుపు నేపథ్యంలో ఆ పార్టీలు విస్తృత స్థాయిలో మంతనాలు జరిగాయి. గడువు పెంపు కోసం శివసేన చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చడంతో అనూహ్యంగా ఎన్సీపీ తెరపైకొచ్చింది. మొత్తానికి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు ఏం జరగబోతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.