పథకాలకు, అంకెలకు పొంతన లేని ఏపీ బడ్జెట్.. అన్నీ అనుమానాలే!

 

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివిధ కేటాయింపులను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రభుత్వాన్ని విమర్శిం చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర బడ్జెట్‌లా లేదని, వైసీపీ మేనిఫెస్టోలా ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన ఇరిగేషన్‌ ప్రాజెక్టులు 40 ఉండగా వాటికి సుమారు రూ.90 వేల కోట్లు అవసరం ఉంటుందని, అయితే బడ్జెట్‌లో రూ.13వేల కోట్లు కేటాయించారని అన్నారు. ఈ నిధులలో రూ.5 వేల కోట్లకు పైనే పోలవరం ప్రాజెక్టుకు కేటాయిస్తే మిగిలిన ప్రాజెక్లు సంగతేమిటని ప్రశ్నించారు. ఇవన్నీ ఎన్ని ఏళ్లకు పూర్తి అవుతాయని గోరంట్ల నిలదీశారు.

ఉగాది నాటికి 25 లక్షల ఇంటి పట్టాలు పేదలకు అందిస్తామని, ఐదు లక్షల పక్కా గృహాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, వీటన్నింటికి రూ.55 వేల కోట్లు అవసరమవుతాయి కాని బడ్జెట్‌లో రూ.8,500 కోట్లు కేటాయిస్తే హామీలు ఎలా నెరవేరతాయని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద 20 లక్షల ఇళ్లు కట్టిస్తే గతంలో మా ప్రభుత్వం ఒక్క రాష్ట్రంలోనే 8 లక్షల ఇళ్లు పేదలను నిర్మించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం పూర్తిగా సందేహాలు, అనుమానాలతోనే నడుస్తోందని ఏద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల పైనే ఎవరైనా మాట్లాడతారని, పథకాలకు, అంకెలకు పొంతన లేకుండా చెప్పడం మంచి సంప్రదాయం కాదని గోరంట్ల అన్నారు.

టీడీపీ హాయాంలో విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు రాద్ధాంతం చేస్తున్నారని, జాతీయ రాష్ట్ర టారిఫ్‌ కమిషన్లే ధరలు నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. ఈ విషయం కూడా తెలియకుండా ప్రజల్లో తమను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని గోరంట్ల విమర్శించారు.