79కి చేరిన గోర‌ఖ్ పూర్ మృతుల సంఖ్య‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గోర‌ఖ్ పూర్ లో బాబా రాఘ‌వ్ దాస్ మెడిక‌ల్ క‌ళాశాల ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించిన చిన్నారుల సంఖ్య 79కి పెరిగింది. ఆస్ప‌త్రి బకాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే సంస్థ దానిని నిలిపివేయ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌మాదం విష‌యం తెలుసుకున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల‌ను ప‌రామ‌ర్శించి..వైద్యుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వ సార‌థ్యంలో న‌డిచే బాబా రాఘ‌వ దాస్ వైద్య‌క‌ళాశాల ఆస్ప‌త్రికి ఎంతో కాలం నుంచి పుష్పా సేల్ సంస్థ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే చాలా రోజుల నుంచి ఆస్ప‌త్రి బ‌కాయిలు చెల్లించ‌డం లేదు. ఎన్నిసార్లు విన్న‌వించినా.. త‌మ వ‌ద్ద నిధులు లేవ‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం చెప్ప‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను నిలిపివేసింది స‌ద‌రు సంస్థ‌. వారి నిర్ల‌క్ష్యం కార‌ణంగా 79 మంది పిల్ల‌ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.