యూపీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది.. పెరుగుతున్న చిన్నారుల మృతుల సంఖ్య....

 

ఉత్తరప్రదేశ్‌లో చిన్నారుల మరణం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృతి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకూ చనిపోయిన మృతల సంఖ్య 63కు చేరింది. దీనికి కారణం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగా వీరంతా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే వైద్యులు మాత్రం.. మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని వాదిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పిల్లల వార్డు, మెదడువాపు వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని.. మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని పేర్కొన్నారు.

 

మరోవైపు దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పేదలంతా వైద్యం కోసం వస్తుంటారు. ఈ ఆస్పత్రికి అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల.. దాదాపు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో.. ఆ సంస్థ ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసింది. దీనివల్ల చిన్నారులు చనిపోతున్నట్టు చెబుతున్నారు.