అర్థం చేసుకునే మనసు

ఒక పిల్లవాడు కుక్కపిల్లలను అమ్మే షాపులోకి వచ్చాడు. ‘అంకుల్! నేను కుక్కపిల్లను కొనాలనుకుంటున్నాను. ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే ఎంత కావాలి?’ అని అడిగాడు. ‘కుక్కపిల్లను బట్టి 300 నుంచి 500 దాకా ఖర్చవుతుంది’ అని జవాబిచ్చాడు షాపు యజమాని.

 

‘ప్రస్తుతానికి నా దగ్గర ఓ వంద రూపాయలే ఉన్నాయి కానీ, ఓసారి మీ దగ్గర ఉన్న కుక్కపిల్లను చూడవచ్చా!’ అని అడిగాడు పిల్లవాడు.

 

దానికి షాపు యజమాని పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్లి, అక్కడ ఓ గదిలో ఆడుకుంటున్న కుక్కపిల్లలను చూపించాడు. వాటిలో ఒక కుక్కపిల్ల కదలకుండా అలాగే కూర్చుని ఉంది.

 

‘ఆ కుక్కపిల్లకి ఏమైంది? ఏమన్నా జబ్బు చేసిందా!’ అని ఆందోళనగా అడిగాడు పిల్లవాడు.
‘జబ్బు కాదూ పాడూ కాదు! దానికి ఓ కాలు పనిచేయదు. కుంటుకుంటూ నడుస్తుంది’ అని చిరాగ్గా బదులిచ్చాడు యజమాని.

 

‘అంకుల్! నాకు ఆ కుక్కపిల్లే కావాలి. దాని కోసం ఈ వంద రూపాయలు తీసుకోండి’ అన్నాడు పిల్లవాడు. ‘చవగ్గా వస్తుందని ఆ కుక్కపిల్ల కావాలనుకుంటున్నావేమో! అదెందుకూ పనికిరాదు. కావాలంటే ఉచితంగానే దాన్ని తీసుకుపో!’ అని కసురుకున్నాడు యజమాని.

 

‘అబ్బే చవగ్గానో ఉచితంగానో వస్తుందని కాదు. దాన్ని నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. ఇప్పుడు ఇచ్చే వంద రూపాయలే కాకుండా మళ్లీ వచ్చి మిగతా డబ్బులు కూడా ఇస్తాను’ అన్నాడు పిల్లవాడు.

 

పిల్లవాడి మాటలతో యజమానికి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ‘నీకేమన్నా పిచ్చా! ఆ కుక్కపిల్లనే కొనుక్కుంటానని అంటావేంటి? అది మిగతా కుక్కపిల్లల్లాగా పరుగులెత్తలేదు, గంతులు వేయలేదు... కనీసం చురుగ్గా నడవలేదు’ అని కోప్పడ్డాడు యజమాని.

 

యజమాని మాటలకి పిల్లవాడు ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేదు. ఆ తరువాత నిదానంగా తన ప్యాంటుని పైకి ఎత్తి చూపించాడు. అతని మోకాలి నుంచి అరికాలి వరకూ లోహపు పట్టీలు వేసి ఉన్నాయి. అప్పటిదాకా పిల్లవాడి అవిటితనాన్ని యజమాని గమనించనేలేదు. ‘శరీరంలో ఒక భాగం లేనంత మాత్రాన ఆ కుక్కపిల్ల విలువ తగ్గిపోవడం నాకిష్టం లేదు. పైగా అది కూడా నాలా పెద్దగా పరుగులెత్తలేదు కాబట్టి నాకు తోడుగా ఉంటుంది. నా బాధని తనన్నా అర్థం చేసుకుంటుంది’ అన్నాడు పిల్లవాడు కన్నీళ్లని ఆపుకుంటూ!

 

కష్టంలో ఉన్న జీవికి కావల్సింది ఓదార్పు, ప్రోత్సాహం.... అన్నింటికీ మించి ఆ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు అని తెలిసొచ్చింది యజమానికి.

..Nirjara