కోటని తవ్వి ఎముకలు పట్టారు!

 

 Gold hunt in UP, sadhu Shobhan Sarkar, Unnao gold rush, Uttar Pradesh

 

 

ఉత్తరప్రదేశ్‌లోని రాంబకష్ సింగ్ కోటలో గత ఐదు రోజులుగా పురావస్తు శాఖ అధికారుల పరిస్థితి కోటని తవ్వి ఎముకల్ని పట్టినట్టయింది. కోట భూమిలో టన్నులకొద్దీ బంగారం ఉందని శోభన్ సర్కార్ అనే స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి తవ్వకాలు మొదలుపెట్టిన పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం తవ్వకాల్లో ఒక వంటగది, పొయ్యి, కొన్ని ఎముకలు బయటపడటంతో నోళ్ళు తెరిచారు.


స్వామీజీ మాటలు నమ్మి కోటని తవ్విపోస్తున్నారేంటని హేతువాదులు విమర్శిస్తే, స్వామీజీ చెప్పారని కాదు.. అక్కడి భూమిలో నిధులున్నాయని తమ పరిశోధనల్లో బయటపడిందని అధికారులు మొదట్లో చెప్పారు. తాజాగా బుధవారం కొత్త స్టోరీ వినిపించారు. కోటలో తవ్వకాలు జరుపుతోంది నిధుల కోసం కాదట.. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఉపయోగించిన ఆయుధాల కోసమట.



దేశంలోని ఏ  పురావస్తు పరిశోధనశాలలోనూ సిపాయిల తిరుగుబాటు కాలం నాటి ఆయుధాలు లేవట. ఆ లోటుని భర్తీ చేయడానికే ఈ తవ్వకాలు చేపట్టారట. వీళ్ళ తవ్వకాల్లో ఆయుధాలు దొరికితే  వాటిని ప్రదర్శనలో పెడతారట. వీళ్ళ మాటలు వింటుంటే జనం చెవిలో పూలు పెట్టడంలో పురావస్తు శాఖ అధికారులు శోభన్ సర్కార్ స్వామీజీని మించిపోయారని అనిపించడం లేదూ?!  అన్నట్టు ఇంత జరగడానికీ కారణమైన స్వామీజా శోభన్ సర్కార్‌తోపాటు ఆయన శిష్యుడి మీద కేసు నమోదైంది.