తెలంగాణకు షాకిచ్చిన ఏపీ.. గోదావరిపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్

తెలంగాణ సర్కార్ కి గోదావరి నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు గోదావరి బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది. పునర్‌విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని ఏపీ ఫిర్యాదు చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించరాదని గోదావరి బోర్డు స్పష్టం చేసింది. దీంతో  కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు బోర్డు బ్రేకులు వేసినట్లైంది.

గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. గోదావరి నది మీద తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అందులో ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ఐఎస్, మిడ్ మానేర్ డ్యామ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులన్నింటి నిర్మాణ పనులు వెంటనే ఆపేయాలని గోదావరి రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చించనున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ జూన్ 4న జరగనుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఆ విషయం మీద తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాలపై ఏపీ నిర్ణయాన్ని కార్నర్ చేసి కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. గోదావరిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్ట్ లను  ఏపీ టార్గెట్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల  రాష్ట్రాల మధ్య జల రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఈ జల జగడానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.