గోదావరిలో వరుస ప్రమాదాలు... ఇప్పటివరకు 300మంది మృతి... అయినా జాగ్రత్తలు నిల్...

గోదావరిలో పడవ ప్రయాణాలు ప్రాణాలు తీస్తున్నాయి. 1964లో ఉదయభాస్కర్ బోటు మునిగి 60మంది మృతిచెందగా, 1995లో తూర్పుగోదావరి జిల్లా పాపికొండల దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో 98మంది చనిపోయారు. ఇక 2009లో ఇదే తూర్పుగోదావరి దేవీపట్నం మండలం, కొండమొదలు దగ్గర జరిగిన పడవ ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. 2012లో గన్నవరం దగ్గర బోటు బోల్తాపడి ఐదుగురు మహిళలు మరణించారు. ఇక గతేడాది జులై 14న పశువుల్లంకలో నాటు పడవ మునిగిన అభంశుభం తెలియని విద్యార్ధినులు మృత్యువాతపడిన ఘటన ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తోంది.

గోదావరిలో ఇప్పటివరకు అనేక ప్రమాదాలు జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయినా, ఆ ప్రమాదాల నుంచి ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పర్యాటకుల భద్రతను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే తీరు. దాంతో పర్యాటకుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇక అధికారుల గురించి చెప్పకోవడం కూడా దండగే. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే, ఆ బోటుకు అనుమతి లేదు... ఇది లేదు అంటూ హడావిడి చేయడం తప్ప... ముందుగా చర్యలు తీసుకున్న దాఖలాలు ఒక్కటీ లేదు. ఒకవేళ నిజంగా అధికారులు సక్రమంగా పనిచేసి ఉంటే, గోదావరి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో బోటు అస్సలు పాపికొండలకు బయలుదేరే కాదు. అంతమంది జలసమాధి అయ్యేవారే కాదు.

తూర్పుగోదావరిలో గతేడాది జరిగిన రెండు భారీ ప్రమాదాలను మరిచిపోకముందే, ఇప్పుడు మరో దారుణం జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. దాంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. మరి ఈ ప్రమాదంతోనైనా ప్రభుత్వం మేల్కొంటుందో లేదో చూడాలి.