గో‘దారి‘లో ఘోరం... 47మంది గల్లంతు... 26మంది సేఫ్

విహారయాత్ర విషాదాంతమైంది. పర్యాటక బోటు... ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. నదీ అందాలను వీక్షించాలనుకున్న పర్యాటకులను గోదారమ్మ అమాంతం మింగేసింది. పాపికొండలను చూడకుండానే తిరిగిరాని గమ్యాలకు చేర్చింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు కొండ దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి పాపికొండలకు బయల్దేరిన బోటు... గంటలోపే ప్రమాదానికి గురైంది. కచ్చులూరు కొండ దగ్గర కుదుపునకు లోనై గోదావరిలో మునిగిపోయింది.

బోటులో మొత్తం 73మంది ఉండగా, ప్రమాదం నుంచి 26మంది బయటపడ్డారు. ఇక గల్లంతైన 47మందిలో ఇప్పటివరకు 12మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 35మంది ఆచూకీ లభించాల్సి ఉంది. అయితే గల్లంతైన వారి కోసం గోదావరిలో ముమ్మర గాలింపు జరుగుతోంది. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో గాలిస్తున్నాయి. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు, అధికారులు... దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదం జరిగిన బోటులో ఎక్కువమంది తెలంగాణవాసులే ఉన్నారు. హైదరాబాద్ నుంచి 22మంది‌, వరంగల్‌ నుంచి 14మంది... మొత్తం 36మంది పాపికొండల విహార యాత్రకు వచ్చారు. వరంగల్‌ నుంచి వెళ్లిన 14మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకా 9మంది ఆచూకీ దొరకాల్సి ఉంది.