ఆ జాదూ అందుకే పనిచేయలేదా

 

రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను తెలంగాణా వాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేఖించేవారు. ఇంకా రాష్ట్ర విభజన జరుగక ముందే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణం, రాజకీయ పార్టీల కప్పగంతులు తదితర అంశాలన్నీఆజాద్ భయాలు నిజమని ఋజువు చేస్తున్నాయి.

 

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఎదురయిన అనుభవాలు, ఆజాద్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని, వాటిపై కూలంకుషంగా చర్చించిన తరువాతనే విభజన ప్రకటన చేసామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలకు జవాబు చెప్పలేకపోతోంది. అంతే గాక మళ్ళీ వెనకడుగు వేయక తప్పడం లేదు.

 

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన చేయాలని ఆరేడు నెలల క్రితమే నిర్ణయించుకొన్నట్లు వచ్చిన వార్తలు గమనిస్తే, అంత సమయం ఉంచుకొని కూడా క్లిష్టమయిన అంశాలకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రకటన చేసినట్లు అర్ధం అవుతోంది. కనీసం ప్రకటన మరికొంత కాలం జాప్యం చేసి ముందుగా ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదేమో.

 

అయితే, తెరాస నుండి తానెత్తుకు వచ్చిన తెలంగాణా అంశాన్ని, హైదరాబాద్ పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోడీ ఎక్కడ ఎగురేసుకు పోతాడో అనే భయంతోనో లేక మరో కారణంతోనో కాంగ్రెస్ చాలా హాడావుడిగా రాష్ట్ర విభజన ప్రకటన చేసేసి తన గొయ్యి తానే తవ్వుకొంది.

 

క్లిష్టమయిన రాష్ట్ర విభజన సమస్యను తలకెత్తుకోవడం ఎందుకనే ఆలోచనతోనే బహుశః గులాం నబీ ఆజాద్ దానిని నాన్చుతూ కాలక్షేపం చేసి ఉండవచ్చును. అయితే ఆయన ధోరణి నచ్చకనో లేక రాష్ట్ర విభజన చేసిన ఘనత దక్కించుకోవాలనే ఆలోచనతోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తప్పించి ఆయన స్థానంలో స్థానంలో దిగ్విజయ్ సింగ్ ను నియమించింది. రాహుల్ గాంధీకి చెక్కభజన చేసే దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు చెప్పటిన నెలరోజుల లోగానే, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పావులు కదిపి రాష్ట్ర విభజన ప్రకటన చేసేసారు. గులాం నభీ ఆజాద్ చేయలేని ఘనకార్యం దిగ్విజయ్ సింగ్ చేసినప్పటికీ, అది సమస్యను పరిష్కరించక పోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. మరి దీనిని ఆజాదూ మాయం చేస్తాడో లేక మన సింగ్ బాబే దిగ్విజయంగా పూర్తిచేస్తాడో చూడాలి.