ఇంటికే ఈ-చలానా.. జూలై 1 నుంచి GHMC కొత్త రూల్!!


జీహెచ్‌ఎంసీ కూడా ట్రాఫిక్‌ పోలీసుల తరహాలోనే ఉల్లంఘనుల ఇంటికే ఈ-చలానా పంపాలని భావిస్తోంది. జూలై 1వ తేదీ నుంచి ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ కసరత్తు ప్రారంభించింది. చెత్త వ్యర్థాలే కాదు అక్రమ హోర్డింగ్‌లు అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్‌ పోస్టర్లు, గోడ రాతలకూ జరిమానా విధించనున్నారు. ఉల్లంఘనను బట్టి రూ. 100 నుంచి రూ. 10,000 వరకు జరిమానా విధించనున్నారు.

జీహెచ్‌ఎంసీ  ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తోంది. నిఘాను మరింత పక్కాగా, నిరంతరాయంగా కొనసాగించే క్రమంలో భాగంగా ఈ- చలానా విధింపునకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉల్లంఘనుల గుర్తింపులో ట్రాఫిక్‌ పోలీసుల విధానాన్నే జీహెచ్‌ఎంసీ అవలంభించనుంది. ఎవరైనా వ్యక్తి బైక్‌, ఇతర వాహనంలో వెళ్తు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తే వెహికిల్‌ నెంబర్‌ ఆధారంగా చిరునామాకు ఈ-చలానా పంపుతారు. నిర్ణీత గడువులోపు ఆ వ్యక్తి జరిమానా చెల్లించని పక్షంలో దానిని ఆస్తిపన్నులో కలిపే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. డంపర్‌ బిన్‌లో కాకుండా పక్కన, ఇతర ప్రాంతాల్లో చెత్త వేసినా వారిని గుర్తించి పెనాల్టీ విధిస్తారు. వాహనాల్లో వచ్చిన వారిని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించే అవకాశం ఉండగా పాదచారుల విషయంలో ఆ వెసులుబాటు లేదు. గస్తీ నిర్వహించే ప్రత్యేక బృందాలు అలాంటి వారిని గుర్తించి అతని పేరు, మొబైల్‌ నెంబర్‌, ఇతరత్రా వివరాలు తీసుకొని చలానా పంపుతారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి ఆన్‌లైన్‌ లేదా సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లలో చెల్లించే అవకాశం ఉంటుంది.

నగరంలోని చెరువులు, ఖాళీ స్థలాల్లో నిర్మాణ రంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ యథేచ్ఛగా జరుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని జీహెచ్‌ఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ఫుటేజీ ఆధారంగా ఏ సమయంలో అక్రమంగా వ్యర్థాలు డంప్‌ చేసినా వాహనం నెంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి చలానా ఇంటికి పంపుతారు.

సాధారణ పౌరులు కూడా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు. పౌరులు ఉల్లంఘన గుర్తిస్తే మొబైల్‌లో ఫొటో తీసి జీహెచ్‌ఎంసీకి పంపే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో సీఈసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.