గజల్ శ్రీనివాస్‌పై వేటేసిన ఏపీ..

లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న గాయకుడు గజల్ శ్రీనివాస్‌పై మరో వేటు పడింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన నియామకాన్ని రద్దు చేసింది. 2017 మే 28న గజల్ శ్రీనివాస్‌ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా గజల్‌ని నియమించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌లో నిర్వహిస్తోన్న సేవ్ టెంపుల్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శ్రీనివాస్‌ను ఆ సంస్థ యాజమాన్యం ఆ హోదా నుంచి తప్పించింది. సదరు సంస్థ యజమానులు అమెరికాలో ఉంటుండటంతో.. శ్రీనివాస్‌కు ఆ సంస్థ బాధ్యతలను అప్పగించడంతో ఆయనే వ్యవహారాలు చూసుకుంటున్నారు. లైంగిక వేధింపుల కేసు వెలుగు చూడటంతో సేవ్ టెంపుల్ యాజమాన్యం ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించింది.