ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయనిర్మల...ఒకే ఓటమితో గుడ్ బై

ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ భార్య, దర్శకురాలు విజయనిర్మల గత అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆమె భౌతికకాయం మరికాసేపట్లో నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి చేరనుంది. అయితే ఆమె గురించిన ఒక ఆసక్తికర అంశం బయటకొచ్చింది. అదేంటంటే సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న విజయనిర్మల రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ వేయాలని భావించారు. కానీ, రాజకీయ రంగంలో ఆమె తొలి ప్రయత్నంలోనే విఫలమయ్యారు. అంతటితో, తనకు రాజకీయాలు అచ్చిరావని నిర్ణయించుకుని, వాటికి దూరంగా ఉన్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, కృష్ణా జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఎర్నేని రాజా రామచందర్ చేతిలో పదకొండు వందల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటికి బాబు సర్కార్ మీద వ్యక్తిరేకత లేకున్నా నాన్ లోకల్ అనే పేరుతో ఈమె త్రుటిలో ఓడిపోయినట్టు చెబుతారు, ఇక ఈ దెబ్బకి ఆమె మళ్ళీ రాజకీయాల్లో రావాలని అనుకోలేదు. ఏకంగా ఆమె క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆమె తప్పుకోవడమే కాక కృష్ణను కూడా వేరే ఏ పార్టీలో చేరనివ్వలేదు.