వేసవిలో నాలుకను తడిగా వుంచండి ఇలా...!

 

వేసవిలో అధికంగా వేధించే సమస్య నోరు ఎండిపోవడం. మాటిమాటికీ తడి ఆరిపోయి నాలుక పిడచకట్టుకుపోవడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. నిజానికిది మంచిది కూడా కాదు. నోటిలో లాలాజలం ఎప్పుడూ ఊరుతూ ఉండాలి. లేదంటే నోటి ఇన్ఫెక్షన్లతో పాటు దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. జీర్ణక్రియలో లాలాజలానికి ఎంతో ముఖ్యమైన పాత్ర కాబట్టి జీర్ణక్రియా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అయితే నోరు ఎండిపోవడం అన్నది పెద్ద సమస్యేమీ కాదు. వేసవి వేడికి అలా అవుతూ ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.

 

పొద్దున్న లేవగానే నీటిలో ఉప్పు వేసుకుని బాగా గాగుల్ చేయండి. రోజంతా నోరు తేమగానే ఉంటుంది. రోజంతా తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే కూడా నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంది. సోంపు కూడా పొడిబారడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ లాలాజల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే ఓ చిన్న గ్లాసుడు కలబంద జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా నిమ్మరసం. దీనిలో కాసింత తేనె కలుపుకుని ఉదయాన్నే సేవిస్తే రోజంతా నోటిలో లాలాజలం ఉత్పత్తి అయ్యి, నోరు ఎండిపోకుండా ఉంటుంది. ఓ గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర వేసి కలిపి తాగినా మంచిదే. కొత్తిమీరకు కూడా లాలాజలాన్ని ఉత్పత్తి చేసే లక్షణం ఉంది. అందుకే వేసవిలో వంటకాల్లో కొత్తిమీర మోతాదును పెంచండి. అప్పుడప్పుడూ ఓ యాలక్కాయనో, చిన్న అల్లం ముక్కనో నోటిలో వేసుకున్నా కూడా నోటిలో తేమ పెరిగి పొడిదనం మాయమవుతుంది.

 

ఇవేవీ పెద్ద కష్టమైన విషయాలు కాదు. తేలికగా అనుసరించదగ్గవే. కాబట్టి వేసవిలో చిరాకు పుట్టించే ఈ సమస్యకి సింపుల్ గా చెక్ పెట్టేయండి.

 

- Sameera