దాగుడుమూతలు ఆడుతున్న గంటా.. అడుగులు ఏ పార్టీ వైపు?

 

విశాఖ ఉత్తర నియోజక వర్గం టిడిపి ఎమ్మెల్యే గంటా పార్టీని వీడుతారని గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరిగింది. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా టాక్ వినిపించింది. అయితే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా వస్తే పార్టీకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆ మంత్రి అధిష్ఠానం వద్ద గట్టిగా వాదించారు. దీంతో అధిష్టానం కూడా ఆలోచనల్లో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేక పోయింది. అయితే మారిన రాజకీయ పరిస్ధితుల్లో బిజెపిలో చేరాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గం చెబుతుంది. ఇప్పటికే ఆయన జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి బిజెపి నేతలతో మంతనాలు కూడా జరిపారు. సమీప రోజుల్లోనే ఆయన సైకిల్ దిగడం ఖాయమని విశాఖలో వార్తలు గుప్పుమంటున్నాయి. విచిత్రమేమిటంటే గంటా రాకను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తుంటే కమలం పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఆయన రాకను నగరంలో మెజారిటీ బిజెపి నేతలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ బిజెపి పెద్దలతో గంటా శ్రీనివాసరావు ఒక దఫా చర్చలను పూర్తి చేశారు. గంటాతో పాటు పలువురు టిడిపి నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. 

ప్రజారాజ్యం పార్టీలో గంటా` ఉన్నప్పుడు నగరంలో చాలా మంది నేతలు ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకవేళ టిడిపిని గంటా వీడితే ఎవరెవరు ఆయన్ను అనుసరిస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. బిజెపిలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న అంశాన్ని ఆ పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తే అవును కొంతమంది టిడిపి నేతలు మా పార్టీ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు అని బదులిస్తున్నారు. ఎవరెవరు చేరబోతున్నారు అని అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దు అని సమాధానం దాటవేస్తున్నారు. ఇదిలా వుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అయితే ఎపిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొని నిలబడాలంటే బీజేపీలో చేరడం మంచిదనే అభిప్రాయానికి చాలా మంది నేతలు వచ్చేశారు. తమకు రాజకీయ రక్షణ కోసం విశాఖ టిడిపికి చెందిన కొంతమంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరు కూడా తాము టిడిపిని వీడి బిజెపిలోకి వెళుతున్నామని బహిరంగంగా చెప్పడం లేదు. అలా అని వలసలపై వస్తున్న వార్తలను సైతం వారు ఖండించడం లేదు. కావున గంటాపై వినిపిస్తున్న వార్తలు ఊహాజనకంగా మిగులుతాయో నిజమవుతాయో చూడాలి.