మాజీ మంత్రి గంటాకు జగన్ ఝలక్..!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో వైసిపిలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా అందుతున్న సమాచార ప్రకారం అయన డైలమాలో పడ్డట్టుగా తెలుస్తోంది. గంటా వైసిపిలోకి ఎంట్రీ ఖాయం కావడంతో విశాఖకు చెందిన మంత్రి అవంతి గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన గంటా తాజాగా సీఎం జగన్ ను కలిసి పార్టీలో చేర్చుకున్న తరువాత తనకు పదవి కావాలని కోరినట్లుగా సమాచారం. ఐతే మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిస్తే తప్పకుండా చూస్తానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరుల పై కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గంటా దీంతో ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. 

 

తాను ఏ పార్టీలో ఉన్నా కూడా అధికారానికి దూరంగా ఏమాత్రం ఉండలేని గంటా సీఎం తాజా ప్రతిపాదనతో గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత మూడు ఎన్నికలలో మూడు వేర్వేరు నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలిచిన అయన సీఎం ప్రపోజల్ తో ఎటు పాలుపోని పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే టీడీపీ నుండి బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేల మాదిరిగా అయన కూడా ఏ పదవి ఆశించకుండా ఎదో విధంగా సర్దుకు పోయేటట్లైతే.. ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 16 న గంటా వైసిపిలో ఎంట్రీ పక్కా... అలా కాక పదవి కోసం చూస్తే మాత్రం ఎంట్రీ డౌటేనని వార్తలు వస్తున్నాయి.