మంత్రి గంటా ఆస్తుల జప్తు

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు‌కు షాక్ తగిలింది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం గంటా తాకట్టు పెట్టిన రెండు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో స్వాధీన ప్రకటన జారీ చేసింది. మంత్రి బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం 2005లో విశాఖపట్టణంలోని ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.141.68 కోట్ల రుణం తీసుకున్నారు. దీనిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అది వడ్డీతో కలిపి రూ.196 కోట్లు అయింది.

 

 

తీసుకున్న రుణం చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు పలుమార్లు కంపెనీకి నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తులతో పాటు రుణం కోసం హామీదారులుగా ఉన్న మంత్రి గంటా, కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను గత డిసెంబర్‌లో ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. మిగిలిన బకాయిలను చెల్లించేందుకు మరో రెండు నెలలు గడువు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో పెరిగిన వడ్డీతో కలిపి మొత్తం రూ.203.62 కోట్లకు సంబంధించి మరోమారు ఆస్తులు స్వాధీనం చేసుకుంది.