గన్నవరంలో వంశీకి షాక్ ఇచ్చేందుకు ఓటర్లు రెడీ.. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ 

రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎప్పటినుండో టీడీపీకి కంచుకోట. అటువంటి నియాజకవర్గం నుండి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో సీఎం జగన్ కు జై కొట్టి వైసిపిలో చేరిపోయారు. వైసిపిలో చేరిన తరువాత ఇక్కడి ఎమ్మెల్యే, అలాగే వైసిపి నియోజకవర్గ ఇంచార్జి కూడా తానేనని వంశీ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసిపి తరుఫున పోటీ చేసి గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని వంశీ ఒక పక్కన గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. అయితే వైసిపిలో ఇప్పటికే ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు మాత్రం ఆసక్తిగా పరిస్థితులను గమనిస్తున్నాయి.

 

ఇది ఇలా ఉండగా తాజాగా నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నిక జరిపితే ఎవరికి ఓటేస్తారనే విషయం పై ఒక సర్వే జరిగింది. అయితే ఈ సర్వేలో కొన్ని షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఉప ఎన్నిక కనుక వస్తే.. వైసిపి తరుఫున వంశీ నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా టీడీపీ తరుఫున ఎవరు పోటీ చేసినా ఆ పార్టీనే గెలిపించుకుంటామని 54 శాతం మంది తెలిపారు. దీనికి గల ప్రధాన కారణాలు.. ఒకటి వంశీ పార్టీ మారినా టీడీపీ కేడర్ ఏమాత్రం చెక్కు చెదరకపోవడంతో పాటు తాము కష్టపడి గెలిపిస్తే తమను పట్టించుకోకుండా కేవలం తన స్వార్ధం కోసం వైసిపిలోకి జంప్ అయ్యాడని గుర్రుగా ఉన్నారట. రెండు.. వైసిపి కేడర్ కూడా పార్టీ పై ఎంత అభిమానం ఉన్నా వంశీ పోకడలు నచ్చకపోవడంతో పాటు ఎప్పటినుండో పార్టీలో ఉన్న కేడర్ పై దాడులు చేయడంతో వారు కూడా వంశీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారట.

 

తాజాగా జరిపిన సర్వేలో నియోజకవర్గంలోని మొత్తం 3200 మంది నుండి అభిప్రాయాలూ సేకరించారట.. ఈ సర్వేలో టీడీపీకే ఓటు వేస్తాం అని ఏకంగా 54శాతం మంది చెప్పడంతో ప్రస్తుతం వంశీ మీద నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పకనే చెపుతోంది. వంశీ పార్టీ మారడానికి కారణాలు ఏవైనా అటు టీడీపీ కేడర్ ఇటు వైసిపి కేడర్ కూడా వంశీని ఓడించడానికి సిద్దమవడం ఒక రకంగా గన్నవరం లో వంశీ పొలిటికల్ లైఫ్ పతనావస్థకు చేరుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా తయారైందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.