'రావాలి జగన్..కావాలి జగన్' అని తిరిగితే.. రోడ్డున పడేసారని విలపిస్తున్న రైతులు!

 

అణగారిన వర్గాలకు ఆసరా కొరకు ఆనాటి ప్రభుత్వం వారికి భూములిచ్చింది. పదిహేనేళ్లుగా వారు అదే భూమిలో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములను లాక్కునేందుకు సిద్ధమైంది. వైసీపీ నేతలు రైతుల పొట్ట కొట్టేందుకు పావులు కదుపుతూ కుట్రలు చేస్తున్నారు. 

అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలను ఇచ్చి వాగ్దానం నిలబెట్టుకుంటామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఉగాది నాటికి ఈ స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందు కోసం వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో అనేక ప్రాంతాల్లో అధికారులు ఈ సర్వే ప్రక్రియను చేపట్టి నివేదికలు సిద్ధం చేశారు.

అయితే, ఈ భూముల సేకరణను అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కొత్త ఎత్తుగడ వేశారు. గన్నవరం సమీపంలోని అంబాపురంలో ఉన్న 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ జాబితాలో వెయిన్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ సాగు చేసుకుంటున్న 48 మంది రైతు కుటుంబాలు వీధిన పడ్డాయి. 3 దశాబ్దాలకు పైగా ఈ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని.. పదిహేనేళ్లుగా ఇక్కడే సాగు చేసుకుంటున్నామని ఆ రైతులు చెబుతున్నారు. 1992 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం అంబాపురం గ్రామంలోని 11.64 ఎకరాలను కేటాయించింది. ఆనాడు వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయినా అనేక ఇబ్బందులు పడ్డామని వారు గుర్తు చేస్తున్నారు.

2004 లో వైఎస్ పోలవరం కాలువలు తవ్వించడంతో ఆ నీటితో ఇదే పొలాల్లో రెండు పంటలు పండించుకుంటున్నట్టు చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు తమ కుటుంబాలు మొత్తం ఈ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది వైసీపీ నేతలు ఈ భూములపై కన్నేశారని.. అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ భూములను తమకు కాకుండా చేస్తున్నారని వాపోయారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చే ప్రక్రియలోకి ఈ స్థలాన్ని ఎలా చేర్చారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ ను.. కలెక్టర్ ను.. కలిసినా ప్రయోజనం లేకపోవటంతో మీడియాను ఆశ్రయించామన్నారు. జగన్ మోహన్ రెడ్డి రావాలని పాదయాత్రలో కూడా పాల్గొన్నామని.. ఇప్పుడు తమను నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆవేదన చెందుతున్నారు.