రాజకీయాలకు గాలి గుడ్‌బై

గాలి జనార్థన్ రెడ్డి..దేశంలో ఈ పేరుకు ఉన్న పాపులారిటీనే వేరు. అక్రమ మైనింగ్ కోసం రాష్ట్రాల హద్దులు మార్చినా..అపర శ్రీకృష్ణదేవరాయులిగా ఫీలై ఇల్లంతా బంగారు మాయం చేసినా..కోట్ల రూపాయలతో వెంకన్నకి కిరీటాలు చేయించినా..కనుసైగతో ప్రభుత్వాన్ని శాసించినా..500 కోట్లతో కూతురి పెళ్లి చేయించినా అన్ని ఆయనకే చెల్లింది. మంచో, చెడో ఇలాంటి పనుల ద్వారా తనకంటూ దేశవ్యాప్తంగా కొంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి గాలి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు..ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అనుచరులతో అన్నట్లు సమాచారం.

 

కర్ణాటకలో బీజేపీ మంత్రిగా పనిచేసిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బింధువుగా వ్యవహరించారు. అక్రమ గనుల కేసులో జైలుపాలై ఏడాదిక్రితం బయటికి వచ్చారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో జనార్దన రెడ్డి మరోసారి పోటీ చేస్తారని.. బీజేపీలో మరోసారి కీలకంగా వ్యవహరిస్తారని బళ్ళారి, రాయచూరు జిల్లాల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తారని అనుచరులు, కార్యకర్తలు గంపెడు ఆశతో ఉన్నారు. బళ్ళారి లేదా సింధనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా గాలి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని, ఆయన సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను పొలిటిక్స్ నుంచి తప్పుకున్నా పవర్ మాత్రం తన కుటుంబం చేతుల్లో ఉండేలా గాలి స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం.

 

సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, శ్రీరాములు తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడనని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనేక కేసులు మెడ చుట్టూ బిగుసుకుపోవడంతో..మళ్లీ రాజకీయాల్లో ఉంటే మరిన్ని కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందనని భయపడటం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసిన కుమార్తె పెళ్లి విషయంలోనూ కేసులు ఎదురయ్యాయని, ఇప్పటికే ఈ కేసులతో సతమతమవుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని సమస్యల్ని తెచ్చుకోదలచుకోలేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో కొనసాగి మంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని పదేళ్ల క్రితమే అటువంటివన్నీ చూశానని..అలాంటప్పుడు ఇక తనకు పొలిటిక్స్ అవసరం లేదు అన్నారట. గాలి పొలిటిక్స్‌‌లకి గుడ్‌బై చెబుతారా..? లేకుంటే అభిమానుల కోరిక మేరకు మనసు మార్చుకుంటారా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.