గద్దర్ మహాకూటమి అస్త్రంగా మారనున్నారా?

 

తెలంగాణకు మొదటినుండి ఉద్యమాల గడ్డగా పేరుంది. అయితే ఆ ఉద్యమాలలో పాటకి ప్రత్యేక స్థానముంది. ప్రజల్లో స్ఫూరి నింపాలన్నా, ఉద్యమం వైపు అడుగులు వేయించాలన్నా పాటే ఆయుధం. గద్దర్ ఆయుధం కూడా అదే. అసలు గద్దర్ అంటే మొదటగా గుర్తొచ్చేదే పాట. గద్దర్ పాట ఉద్యమానికి స్ఫూర్తి. ఎన్నో గుండెలను కదిలించగల శక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' అంటూ ఎందరినో ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్ పాట కోట్ల గుండెలను కదిలించగలదు. అందుకే ఇప్పుడు మహాకూటమి గద్దర్ ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తుంది.

కేసీఆర్ పై పోటీ చేసేందుకు గ‌ద్ద‌ర్ దాదాపుగా సిద్దపడినట్టు తెలుస్తోంది. రాజ‌కీయ పార్టీలతో పాటు ప్ర‌జ‌లూ త‌న‌ని కోరుకుంటే.. గజ్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు సిద్ధం అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలాంటి సమయంలో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో క‌లుసుకోవ‌డం కొంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. సైద్ధాంతికంగా ఆయ‌న ఏపార్టీలోనూ చేరే అవ‌కాశం లేదు కాబ‌ట్టి.. మ‌హా కూట‌మి ఆయ‌న‌కి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే దీని వెన‌క మ‌హా కూట‌మి వ్యూహం ఉంద‌నీ చెప్పుకోవ‌చ్చు.

కేసీఆర్ మీద కూట‌మి నుంచి ఏదో ఒక పార్టీకి చెందిన ఎవ‌రో ఒక‌ర్ని నిల‌బెట్టినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇత‌ర నేత‌ల్ని విమ‌ర్శించిన‌ట్టుగానే.. త‌న ప్ర‌త్య‌ర్థిపై కూడా కేసీఆర్ మాట‌ల తూటాలు అవలీలగా పేల్చేస్తారు. అదే గ‌ద్ద‌ర్ పోటీకి దిగార‌నుకోండి.. కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం త‌క్కువ‌. అంతేకాదు గ‌ద్ద‌ర్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా మ‌హాకూట‌మికి జ‌రిగే మ‌రో మేలు కూడా ఉంది. గద్దర్ కి ఆయుధ‌మైన పాట ద్వారా తెరాస పాల‌న‌పై ప్ర‌భావవంత‌మైన విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం ఉంది. కేసీఆర్ కి వ్య‌తిరేకంగా గ‌ద్ద‌ర్ ఆటాపాటా రాష్ట్రవ్యాప్తంగా మ‌హాకూట‌మికి ప్ర‌చార అస్త్రంగా మారే అవ‌కాశం ఉంటుంది. కేసీఆర్ మీద గ‌ద్ద‌ర్ లాంటివారు రంగంలోకి దిగితే, ఎన్నిక‌ల ఫ‌లితం అనూహ్యంగా మారుతుందో లేదో చెప్పలేం కానీ.. ఎన్నిక‌ల ప్రచారం మాత్రం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది.