40 ఏళ్ళ తరువాత స్వామి దర్శనం.. నలుగురి మరణం

 

తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ అత్తి వరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులకు గాయాలు కావడంతో కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో ఏపీకి చెందిన మహిళ కూడా ఉంది.

అత్తి వరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 48 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 18వ రోజైన గురువారం శ్రవణా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ క్రమంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. నలుగురు మరణించారు. వీరిలో గుంటూరుకు చెందిన నారాయణమ్మ అనే మహిళ కూడా ఉన్నారు.

కాగా ఈ ఆలయానికి విశిష్టత ఉంది. 40 ఏళ్ళకు ఒకసారి అత్తి వరదరాజ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. వరదరాజ స్వామి ని 40 ఏళ్ళకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన వరదరాజ స్వామి.. ఈ సంవత్సరం జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు దర్శనం ఇవ్వనున్నారు. 40 ఏళ్ళకు ఒకసారి మాత్రమే స్వామి దర్శనం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం భక్తుల రద్దీ మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆలయ రద్దీ దృష్ట్యా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని గర్భిణులకు, వృద్ధులకు స్థానిక కలెక్టర్‌ సూచించారు.