FBS - పిల్లల్ని కారులో మర్చిపోయే జబ్బు

 

అది ఒక పెద్ద షాపింగ్‌ మాల్‌. ఆ మాల్‌ బయట ఓ కారు పార్క్‌ చేసి ఉంది. ఎవరో ఆ కారు పక్క నుంచి వెళ్తూ అందులోని పిల్లవాడిని గమనించారు. ఆ పిల్లవాడు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. వెంటనే నలుగురూ ఆ కారు చుట్టూ చేరి, దాని అద్దాలు పగలకొట్టి పిల్లవాడిని బయటకు తీశారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పిల్లవాడి తల్లిని నానాతిట్లూ తిట్టారు. పిల్లవాడిని ఇలా వదిలేసి వెళ్లడానికి నీకు మనసెలా వచ్చిందంటూ కొట్టినంత పని చేశారు. కానీ ఈ పొరపాటు ఎవరైనా చేయవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. కారణం...

 

తల్లిదండ్రులు పిల్లలను మర్చిపోయే సందర్భాన్ని Forgotten Baby Syndrome (FBS) అంటారు. పిల్లవాడిని ఏ పార్కులోనన్నా మర్చిపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ పైన చెప్పుకొన్నట్లు కారులో మర్చిపోతే మాత్రం అది ఆ పసి ప్రాణానికే ప్రమాదం. తలుపులు వేసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్క 20 నిమిషాలలోనే కారులో భరించలేనంత ఉక్కపోత మొదలైపోతుంది.

 

కారులోని వేడి 42 డిగ్రీలు దాటిన దగ్గర్నుంచీ పిల్లవాడి శరీరం అల్లాడిపోతుంది. పెద్దవారితో పోలిస్తే పిల్లల శరీరం అంత సమర్థంగా వేడిని తట్టుకోలేదు. 3 నుంచి 5 రెట్లు త్వరగా వాళ్లలో వేడి పెరుగుతుంటుంది. ఇంతాచేసి ఆ పిల్లవాడు కారు అద్దాలు బద్దలుకొట్టలేడు. అతను ఎంత ఏడ్చినా చుట్టుపక్కల జనాలకి వినపడదు. ఫలితం... మృత్యువు! ఒక్క అమెరికాలోనే ఇలా FBS వల్ల దాదాపు 40 మంది పిల్లలు చనిపోతున్నారంటే ఇదెంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో 1998 నుంచి ఇప్పటివరకు దాదాపు 700 మంది పిల్లలు FBS కారణంగా చనిపోయారట.

 

ఎవరన్నా పిల్లవాడు కారులో చనిపోయాడంటే గుండె తరుక్కుపోతుంది. ఆ తల్లిదండ్రులది ఎంత నిర్లక్ష్యమో అనిపిస్తుంది. కానీ మన మెదడు పనితీరులోని ఓ చిన్న లోపమే ఇందుకు కారణం అంటున్నారు. మన రోజువారీ పనులన్నింటినీ మెదడులోని motor cortex అనే భాగం నియంత్రిస్తుంది. రోజూ లేవడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఆఫీసుకి చేరుకోవడం.... ఇలాంటి రోజువారీ పనులన్నీ యాంత్రికంగా జరిగిపోయేందుకు motor cortex సాయపడుతుంది.

 

అదే ఎప్పటికప్పుడు ప్రత్యేకించి చేయవలసిన పనులను మాత్రం hippocampus అనే భాగం నియంత్రిస్తుంది. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి తిన్నగా వచ్చేసే మనం దారిలో ఆగి ఏమన్నా తీసుకోవాలంటే hippocampus చొరవ తీసుకోవాల్సిందే. మనం ఒకోసారి చేయాలనుకున్న పని మర్చిపోయి తిన్నగా ఇంటికి చేరుకోవడానికి hippocampusను motor cortex అతిక్రమించేయడమే కారణం. ఇది చాలా సహజమైన లక్షణం. ఈ పొరపాటు ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. కారు వెనక సీట్లో పిల్లవాడు ఉన్నా మతిమరపు సంభవిచవచ్చు! మనసు బాగోలేనప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, నిద్ర సరిగాలేనప్పుడు... ఈ FBSకి లోనయ్యే ప్రమాదం ఎక్కువ.

 

FBS కారణంగా ఎప్పటికప్పుడు పసిపిల్లలు మృత్యువాత పడటంతో కొన్ని దేశాలు Unattended Child పేరిట చట్టాలను రూపొందించాయి. కానీ అనుకోకుండా జరిగే పొరపాటుని ఏ చట్టం మాత్రం ఆపగలదు? కాబట్టి తల్లిదండ్రులే మరికాస్త అప్రమత్తంగా ఉండాలి. పిల్లవాడి పక్కన పర్సు లేదా సెల్‌ఫోన్‌ వంటి అత్యవసరమైన వస్తువుని ఉంచేస్తే... కారు నుంచి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల కోసమే వాటిని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు!!!

- నిర్జర