అతిగా తినేవారి వల్లే ఆకలి చావులు

 

అవసరానికి మించి తినే ఆహారం వల్ల మన ఒక్కరి ఆరోగ్యం మాత్రమే పాడవుతుందని అనుకునేవారం. కానీ మన ఆహారపు అలవాట్లు ఏకంగా ప్రపంచంలోని ఆకలినే శాసిస్తున్నాయని ఓ సర్వే తేల్చి చెబుతోంది. అతిగా తినడం, ఆహారాన్ని వృధా చేయడం వంటి అలవాట్లతో ప్రపంచంలో దాదాపు 20 శాతం ఆహారం పనికిరాకుండా పోతోందని హెచ్చరిస్తోంది. అంతేనా మాంసాహారాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ విలువైన పంటలు వృధా అవుతున్నాయని సర్వే సూచిస్తోంది.

 

స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆహారానికి సంబంధించిన ఈ పరిశోధనకు పూనుకున్నారు. దీని కోసం వాళ్లు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్న గణాంకాలన్నింటినీ సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ తరువాత, తాము అనుకున్నదానికంటే ఎక్కువ ఆహారమే అనవసరంగా వృధా అవుతోందని గమనించారు. ఆహారం పండించే దశ నుంచి దానిని వినియోగించే దశ వరకూ జరుగుతున్న వృధాను గమనిస్తే మన కళ్లు కూడా చెదిరిపోక తప్పదు.

 

ఆహారాన్ని పండించే దశలో జరిగే నష్టాన్ని నివారించడం కష్టం కావచ్చు. కానీ చేతికి అందిన ఆహారాన్ని కూడా మనం వృధా చేయడం దారుణం. ప్రపంచవ్యాప్తంగా పండుతున్న ఆహారంలో దాదాపు పదిశాతం ఆహారాన్ని వృధాగా నేలపాలు చేస్తున్నట్లు గమనించారు. కొందరు అతిగా తినడం వల్ల మరో పదిశాతం ఆహారం ఇతరులకు అందకుండా పోతోందట.

 

సర్వేలో బయటపడిన మరో ఆశ్చర్యకరమైన అంశం – పశువుల పోషణ! పాల కోసమో, మాంసం కోసమో ఇబ్బడిముబ్బడిగా పశువులని పెంచడం వల్ల కూడా ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోందట. ఎందుకంటే ఆ పశువులని పెంచేందుకు టన్నుల కొద్దీ పంటలను వాడాల్సి వస్తోంది. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో దాదాపు 20 శాతం ఇలా పశుపోషణ కోసమే వినియోగిస్తున్నారని తేలింది.

 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదోవంతు మంది సరైన తిండి లేకుండా బతికేస్తున్నారు. ఇప్పటికీ రోజుకి 20 వేల మంది ప్రజలు తగిన ఆహారం అందక చనిపోతున్నారు. మనం వృధా చేస్తున్న ఆహారం వీరికి అందితే ఎంత బాగుంటుందో కదా! అందుకే తిండి మీద కాస్త ధ్యాసని తగ్గించి, ఒంటికి తగిన పోషకాహారం అందుతోందా లేదా అన్న విషయం మీదే దృష్టి పెట్టమంటున్నారు. అంతేకాదు! జంతుసంబంధమైన ఉత్పత్తుల మీద కాస్త ఆసక్తిని తగ్గించుకోమంటున్నారు. మరి ఈ మాట వినేదెవరో!

- నిర్జర.