ఫ్లైఓవర్సా? మృత్యు మార్గాలా?

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్స్ ...మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఫ్లైఓవర్లు నెత్తుటితో తడుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రతి ఫ్లైఓవర్‌పైనా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. దాంతో, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక, గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై... జరిగిన ప్రమాదమైతే.... హైదరాబాదీల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే, బయోడైవర్సిటీ ప్లైఓవర్ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం... ముగ్గురు మృత్యువాతపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బయోడైవర్సిటీ ప్లైఓవరే కాదు.... బేగంపేట్ - పంజగుట్ట ఫ్లైఓవర్ పై కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇక, నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ పైనే తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మలక్ పేట్‌ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి సైదాబాద్ వెళ్లే ఫ్లైఓవర్ పైనా కర్వ్ ఉండటంతో నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. అయితే, హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ప్లైఓవరే అత్యంత డేంజర్ అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు.

హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లలో అత్యంత ఎత్తైనది గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్. నల్గొండ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ రేడియస్‌ 40 మీటర్లు ఉంటే, పంజగుట్టది 60 నుంచి 65 మీటర్లు ఉంటుంది. ఇక, బయోడైవర్సిటీ రేడియస్ మాత్రం 80 నుంచి 120 మీటర్లుగా ఉంది. ఈ ఫ్లైఓవర్‌పై గంటకు ప్రయాణ వేగం  40 కిలోమీటర్లతోనే వెళ్లాలి.. కానీ బోల్తాపడ్డ కారు ప్రమాద సమయంలో 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ...సూపర్‌ ఎలివేషన్‌తో క్రాష్‌ బారియర్స్‌ ఉన్నా ...పైకెగిరి కిందపడింది. 80 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టినా తట్టుకునేలా క్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రాష్‌ బారియర్స్‌ను ఢీకొంటే.. వాహనం తిరిగి వెనక్కి వస్తుంది. కానీ నియంత్రించలేని అతి వేగం వల్ల క్రాస్‌బారియర్స్‌ ను దాటుకుని పైకెగిరి మరీ కారు కింద పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే, రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్‌ వైపు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాల్లేకపోవడంతో బయోడైవర్సిటీ ప్లైఓవర్ పైనుంచి అతివేగంతో దూసుకుపోతున్నారు. అయితే, వంతెన మధ్య భాగంతో దాదాపు 150 మీటర్ల మేర కర్వ ఉండటంతో... వేగాన్ని నియంత్రించాలని ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణంగా డిజైన్ లోపం ఒకటైతే.... జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో రీజన్. 

బయోడైవర్సిటీ ప్లైఓవర్ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ముఖ్యంగా బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పౌరుల్లో మార్పు రాకపోతే, ఇలాంటి ప్రమాదాలను అరికట్టలేమంటున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే, వాహనదారులు ట్రాఫిక్స్ రూల్స్ తోపాటు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించరాదని, అలాగే, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లేవాళ్లు ఫ్లైఓవర్ ఎక్కొద్దని, మలుపులు దగ్గర ఓవర్ టేక్ చేయొద్దని సూచిస్తున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌‌పై సీపీ కెమెరాలు ఉన్నాయంటోన్న పోలీసులు... గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించితే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.