కదిలితేనే జీవితం కనిపిస్తుంది

ఒక రాజుగారికి దూరదేశాల నుంచి ఎవరో రెండు డేగలను బహుమతిగా పంపించారు. తన రాచరికాన్ని చాటుతూ ఆ రెండు డేగలూ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే రాజుగారికి భలే సరదాగా ఉండేది. అవి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరినప్పుడల్లా తన కీర్తిపతాక ఎగిసిపడినంతగా మురిసిపోయేవారు రాజుగారు. కానీ అందులోని ఒక డేగ అకస్మాత్తుగా ఎగరడమే మానేసింది. నిరంతరం ఓ చెట్టు కొమ్మ మీదే కూర్చుని తన దగ్గరకు విసిరేసిన మాంసం ముక్కలను తింటూ కాలం గడపడం మొదలుపెట్టింది.

 

డేగని సాధారణ స్థితికి తీసుకురావడానికి రాజభటులు చేయని ప్రయత్నం లేదు. వైద్యులు వచ్చి పరీక్షిస్తే ఆ డేగలో లోపమేదీ లేదని తేలింది. పక్షులకు శిక్షణ ఇచ్చేవారు వచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. సమస్య చిన్నదే అయినా అది ఎందుకనో రాజుగారి మనసుని బాధించడం మొదలుపెట్టింది. ఒక మామూలు పక్షినే తాను మార్చలేనివాడు ఇక ప్రజలను ఏం పాలిస్తానన్నంతగా విరక్తి మొదలైంది. రాజుగారి బాధని తీర్చేందుకు నలుగురూ నాలుగు రకాలుగా సలహాని ఇచ్చారు. కానీ అవేవీ పనిచేయలేకపోయాయి. రాజుగారి వ్యధని తగ్గించేందుకు నలుగురూ నాలుగు వేదాంతపు మాటలు చెప్పారు. కానీ అవేవీ ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి.

 

ఇక ఆఖరి ప్రయత్నంగా ఒక వేటగాడిని పిలిపించి చూద్దామనుకున్నారు రాజభటులు. వేటగాళ్లు నిరంతరం అడవుల్లోనే బతుకుతుంటారు కాబట్టి వారికి పక్షుల గురించి, వాటి స్వభావం గురించి తెలిసి ఉంటుంది కదా! అలా ఓ వేటగానికి వెతికి పట్టుకుని రాజుగారి ఉద్యానవనంలోకి తీసుకువచ్చారు. ఎగరలేని డేగని చూపించి సమస్యను వివరించారు. ‘ఓస్‌ అంతేకదా! ఈ రాత్రికి నన్ను ఈ ఉద్యానవనంలో వదిలేయండి’ అన్నాడు వేటగాడు.

 

ఉదయాన్నే తన కిటికీలోంచి ఉద్యానవనంలోకి తొంగిచూసిన రాజుగారి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నిన్నటివరకూ స్తబ్దుగా ఉన్న డేగ ఇప్పుడు అంతెత్తున ఎగురుతూ కనిపించింది. వెంటనే ఆ వేటగాడిని పిలిపించారు- ‘‘ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేసిన వృధా అయిపోయాయి. ఆ డేగని అంగుళం కూడా కదిలించలేకపోయారు. నీ చేతిలో ఏం మహిమ ఉందో కానీ ఒక్కరాత్రిలోనే దాని రెక్కలకు పనిపెట్టావు. ఇంతకీ ఏం చేశావేంటి?’’ అని ఆసక్తిగా అడిగారు రాజుగారు.

 

‘‘రాజా! ఆ డేగ మీ ఆతిథ్యంలోని సుఖాన్ని మరిగింది. నోటి దగ్గరకు వచ్చే ఆహారానికి అలవాటు పడింది. అందుకనే దానికి కదలాల్సిన అవసరం లేకపోయింది. నిన్న రాత్రి మాటిమాటికీ దాని మీద దాడి చేశాను, అది కూర్చున్న కొమ్మనల్లా నరికివేశాను. అప్పుడది ఎగరక తప్పలేదు. మనిషి కూడా ఆ డేగలాంటివాడే! తానున్న ప్రదేశం సుఖంగా, తృప్తిగా ఉంటే మిగతా ప్రపంచంలోకి తొంగిచూడడు. ప్రపంచంలో ఇంకెన్ని అవకాశాలు ఉన్నాయో, ఇంకెంత సంతోషం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించడు. వాడి ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడే తన మేధకు పనిపెడతాడు. తనలో లోతుల్లో ఉన్న శక్తిని ఉపయోగిస్తాడు,’’ అంటూ చెప్పుకొచ్చాడు వేటగాడు.
వేటగాడి మాటల్లో జీవితసత్యం కనిపించింది రాజుగారికి.

 

- నిర్జర.