రాజీ పడితే జీవితం అంతే!

ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడేందుకు ప్రయత్నించలేదు. అడ్డుగా ఉన్న మూతని దాటుకుని వెళ్లడం అసాధన్యమన్న భ్రమలోనే అవి ఉండిపోయాయి.

 

ఇంటర్నెట్‌లో ‘flear in a jar’ అని టైప్ చేస్తే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించేదంతా నిజమో కాదా అన్నదాని మీద పెద్ద వివాదమే ఉంది. కానీ చాలా సందర్భాలలో జీవుల ప్రవర్తనను ఇలా ప్రభావితం చేసేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. జంతువులలో కనిపించే ఇలాంటి ప్రవర్తనని conditioning అంటారు. ఈ conditioning ద్వారానే వాటిని ఒకోసారి మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాము కూడా!

 

వీడియోలో కనిపించేంది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుందన్నది సైకాలజిస్టుల మాట. మనుషులు కూడా తమ చుట్టూ ఉండే పరిస్థితులకి ఇలాగే లోబడిపోతుంటారని తెలిసిందే! ‘నేను ఎందుకూ పనికిరానివాడిని,’ ‘నా లోపాలను మించి నేను ఎదగలేను’, ‘ఈ సమస్యలను దాటడం నా వల్ల కాదు’... లాంటి సవాలక్ష నమ్మకాలతో మనల్ని మనమే conditioning చేసుకుంటూ ఉంటాము.

 

ఎప్పుడో ఒకసారి మనకి ఎదురుపడిన పరాజయం మన అనుమానాలు నిజమేనన్న బలాన్ని కలిగిస్తాయి. పైకి ఎదిగేందుకు అడ్డుగా నిలుస్తాయి. మన నమ్మకాలు నిజమో కాదో మరోసారి పరీక్షించకుండానే, వాటని మన లోపాలుగా మార్చేసుకుంటూ ఉంటాము. అందుకే! పరాజయపు మాట పక్కన పెట్టి మరోసారి ప్రయత్నించి చూడమని ఈ పరిశోధన చెబుతోంది. ఎగిరేందుకు ప్రయత్నిస్తేనే కదా.... మనకి హద్దు, అదుపు ఉన్నాయో లేదో తెలిసేది!

- నిర్జర.