బాలాపూర్ రికార్డును బద్దలుకొట్టిన ఫిల్మ్ నగర్... అ-ధర-హో అనిపిస్తోన్న లడ్డూలు

బాలాపూర్ లడ్డూ గతేడాది రికార్డును బద్దలుకొట్టింది. పోటాపోటీగా సాగిన  వేలంలో అనేక మంది ప్రముఖులు పోటీపడగా 17 లక్షల 60 వేల రూపాయలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే లక్ష రూపాయలు అధికంగా పలికింది. బాలాపూర్‌ లడ్డూ వేలం ఈసారి పోటాపోటీగా జరిగింది. ఏకంగా పాతిక మంది పోటీపడ్డారు. దాంతో వేలంపాటపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, నెంబర్ 13లక్షలు దాటిన తర్వాత పాటదారుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. చివరికి, 17లక్షల 60 వేలకు కొలను కుటుంబం సొంతం చేసుకుంది. అంతేకాదు, 1994లో ప్రారంభమైన ఈ వేలం పాటలో కొలను కుటుంబం ఇప్పటివరకు 9సార్లు లడ్డూను దక్కించుకుని రికార్డు సృష్టించింది.

బాలాపూర్‌ లడ్డూను దక్కించుకుంటే, సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. బాలాపూర్‌ లడ్డూని పొలంలో చల్లుకుంటే అధిక దిగుబడి వస్తుందని... ఇంట్లో చల్లుకుంటే ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారని... అలాగే వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని నమ్ముతారు. దాంతో, ఈ లడ్డూకూ ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. అందుకే 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం పాట తక్కువ టైమ్ లోనే లక్షలకు చేరింది. ఇక ఏటా లడ్డూ దక్కించుకున్నవారి అనుభవాలతో ఏటికేడు ధర ఎగబాగుతోంది. అంతేకాదు బాలాపూర్‌ లడ్డూ దక్కించుకున్న వారికి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. అందుకే లక్షల పోసి వేలంలో దక్కించుకుంటారు. అయితే, ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ 17 లక్షలు దాటేయడంతో వచ్చే ఏడాది మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు.

అయితే, బాలాపూర్ రికార్డును ఫిల్మ్ నగర్ బద్దలుకొట్టింది. లడ్డూ అంటేనే బాలాపూర్ గుర్తొచ్చేవారందరికీ, ఈసారి ఫిల్మ్ నగర్ షాకిచ్చింది. బాలాపూర్ లడ్డూరు క్రాస్ చేసి మరీ సరికొత్త రికార్డును సృష్టించింది. బాలాపూర్ లడ్డూ 17లక్షల 60వేలు పలికితే... ఫిల్మ్ నగర్ లడ్డూ ఏకంగా 17లక్షల 75వేలకు బీజేపీ లీడర్ పల్లపు గోవర్దన్ దక్కించుకున్నాడు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ లో లంబోదరుడి లడ్డూలు రికార్డు ధరలు పలుకుతూ అ-ధర-హో అనిపిస్తున్నాయి.