కత్తి Vs స్వామీ… తప్పెవరిది?

ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో బాబూ గోగినేని అనే ఒక నాస్తికుడు రాముడ్ని దుర్భాషలాడాడు. నిజానికి దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తరువాత అదే విషయమై ఓ ఛానల్ చర్చ పెట్టడంతో కత్తి మహేష్ పోన్ ఇన్ లోకి వచ్చాడు. అప్పుడు ఆయన బాబూ గోగినేని రాముడ్ని అన్న మాటల్నే రిపీట్ చేశాడు. ఇది పెద్ద దుమారానికి కారణమైంది. ఇక చివరకు, ఇప్పుడది నగర బహిష్కరణల దాకా వెళ్లింది. కత్తి మహేష్, స్వామీ పరిపూర్ణానంద ఇద్దరూ భాగ్యనగరానికి దూరంగా వుండాల్సిన స్థితి ఏర్పడింది! ఈ కేసు మొత్తాన్నీ కాస్త ఓపిగ్గా విశ్లేషిస్తే బోలెడు విడ్డూరాలు కనిపిస్తాయి! అసలు సమస్య ఈ విపరీతాలే! రాముడ్ని దుర్భాషలాడటం కన్నా ఇవి ఆందోళనకరం…

 

 

బాబూ గోగినేని తన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకుని రాముడ్ని తిట్టిపోశాడు. అది కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మత పరమైన విశ్వాసాల్ని కించపర్చటం కాదు కదా! అయితే, ఆయనెక్కడో అన్న మాటలు అత్యధిక జనానికి తెల్సింది ఎలక్ట్రానిక్ మీడియా వల్ల. ఇలాంటి పెద్దగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం లేని అంశాల్ని లైవ్ లో చర్చకెందుకు పెట్టాలి? జనానికి ఏంటి లాభం? రెచ్చగొట్టడమే మీడియా ఉద్దేశమా అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. ఆ మధ్య శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా అనేక ఛానల్స్ వ్యవహరించిన తీరు ఆలోచించే వారికి ఎవరికైనా వెగటు పుట్టిస్తుంది. పెద్ద పెద్ద సామాజిక సమస్యలు వున్నప్పటికీ ఏమంత ప్రభావితం చేయని అంశాల్ని రచ్చకీడుస్తోంది మన మీడియా! దాని ఫలితమే ఈ తాజా దగుల్భాజీ వివాదం కూడా!

 

 

మీడియా ఉద్దేశ్యపూర్వకంగానో , ఉద్దేశ్యం లేకుండానో వివాదం రేపితే… ప్రభుత్వాలు కూడా అదే కోవలో స్పందిస్తున్నాయి. సమస్య జటిలం అవ్వటానికి ఇది మరో కారణం. కత్తి మహేష్ కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణం అయ్యి వుండవచ్చు. అతను అలా మాట్లాడవచ్చా లేదా అన్నది కోర్టులు నిర్ణయించాలి. కత్తి మహేష్ పై కేసులు నమోదైతే అరెస్ట్ చేయాలి. అవసరం లేదనుకుంటే అతడికి రక్షణ కల్పించి అరెస్ట్ చేయకుండా అయినా వుండాలి. ఇదేదీ చేయకుండా ప్రభుత్వం నగర బహిష్కరణ అనే కొత్త తంతు ముందుకు తీసుకు వచ్చేటప్పటికి వివాదం మరింత ముదిరింది. కత్తిని హైద్రాబాద్ నుంచి తరలించటంతో దళిత సంఘాలు, నేతలు, ఇతర అభ్యుదయవాదులు రోడ్డెక్కారు. వార్ని శాంత పరిచేందుకా అన్నట్టు ధర్మాగ్రహ దీక్ష అన్న పరిపూర్ణానందని నగరం బయటకి తరలించారు. ఇది ఇప్పుడు హిందూ సంస్థలకి కోపం తెప్పిస్తోంది. మొత్తంగా నగర బహిష్కరణల పర్యవసానం ఏంటి? వివాదంలోని ఇరు వర్గాలకి ప్రభుత్వంపై అసతంతృప్తి మిగిలింది!

 

 

కత్తి మహేష్, పరిపూర్ణానందల బహిష్కరణల వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు వున్నాయో మనకు తెలియదు కానీ… మీడియా, ప్రభుత్వం చేసిన వ్యవహారం వల్ల సమాజంలో కొన్ని వర్గాల నడుమ దూరం పెరిగిపోయింది. ఇలా కాకుండా వుంటేనే ముందు ముందు మంచిది. తెలుగు మీడియా జాతీయ, అంతర్జాతీయ మీడియాలను చూసి ఏ అంశాలు నిజంగా చర్చకు పెట్టాలో పునరాలోచించుకుంటే మంచిది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకునేటప్పుడు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తే బావుంటుంది. అంతే తప్ప జటిలం అయ్యేలా ప్రవర్తిస్తే సమాజానికి, దేశానికి మంచిది కాదు. నగర బహిష్కరణలే మార్గమైతే దేశాన్ని ఏలే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యాలు చేసే వారందర్నీ ఒక నగరం నుంచీ మరో రాష్ట్రానికి పంపించేస్తూ కాలం గడపాల్సి వుంటుంది. ప్రభుత్వాలు భావ ప్రకటనే ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించాలి. మనోభావాలు , మత విశ్వాసాలు ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వార్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు వుంచాలి. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సమాజ శ్రేయస్సుకి పని చేయటమే అంతిమంగా చెప్పదగింది…