భర్త తప్పు చేస్తే భార్యకు దారుణ శిక్ష.. మహిళా ఐపీఎస్ పై కోర్టు సీరియస్

 

ఒక కేసులో నిందితుడైన భర్త ఆచూకీ కోసం గర్భవతి ఐన అతని భార్య తో మహిళా ఐపీఎస్ అధికారిణి వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓడిశాలో గత జులై 3న సుందర్‌గఢ్ జిల్లా కణిక గ్రామంలో కారు ఢీ కొని యువకుడు చనిపోయాడు. ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్దకు చేరి నిరసన చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఉత్తమ్ డే తో సహా 14 మందిని నిందితులుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఎస్పీ స్వయంగా రంగం లోకి దిగారు. దీనిలో భాగంగా ఉత్తమ్ డే ఇంటికి వచ్చిన ఆ మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా నిందితుడు అందుబాటులో లేకపోవడం తో అతని ఆచూకీ చెప్పాలని అతని భార్య ఐన ప్రియా డే ను కోరగా ఆమె తనకు తెలియదని చెప్పటంతో ఆగ్రహానికి గురై బూటు కాలితో ఆమె పొత్తి కడుపు మీద తన్నడంతో మరి కొన్ని రోజులలో పండంటి బిడ్డకు తల్లి కావాల్సిన ఆమెకు గర్భస్రావం జరిగి మాతృత్వాన్ని కోల్పోయింది. తన భర్త చేసిన నేరానికి తనకు ఎందుకు శిక్ష విధించారని ఆమె ఎంత రోదించిన ఫలితం లేక పోయింది. ఐతే తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని డిసైడ్ ఐన ప్రియా డే ఒడిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం ఆ మహిళా ఐపీఎస్ అధికారిణి పై క్రిమినల్ కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.