ఒంటరితనంలో జలుబు కూడా సమస్యే!

సంసారాన్ని విడిచిపెట్టేసి హిమాలయాల్లో గడపాలనుకోవడం వింతేమీ కాదు. అది ఏకాంతం! కానీ సమాజంలో ఉంటూ కూడా ఇతరుల తోడు లేకపోవడం బాధాకరం. అది ఒంటరితనం! మన ఆరోగ్యం మీద ఈ ఒంటరితనం ప్రభావం గురించి ఇంతకుముందు చాలా పరిశోధనలే జరిగాయి. ఒంటరితనంతో వేగిపోయేవారు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారనీ, త్వరగా గతించిపోతారనీ తేల్చారు.

 

ఒంటరితనంలో దీర్ఘకాలిక అనారోగ్యాల సంగతి అలా ఉంచితే చిన్నపాటి జలుబు ఎలా వేధిస్తుందో చూడాలని అనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 159 మందిని అయిదు రోజుల పాటు గమనించారు. వీరంతా కూడా 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపలివారే! పరిశోధన కోసం ఎన్నుకొన్నవారందరి దగ్గరా కొన్ని వివరాలను సేకరించారు. వారు తమ జీవితాలలో ఎంత తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు? ఇతరులతో వారి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను గ్రహించారు. ఆ తరువాత వారందరికీ జలుబుని కలిగించే ఒక మందుని ఇచ్చారు. ఒంటరితనంతో వేగిపోయేవారిని జలుబు చాలా తీవ్రంగా వేధించిందట! జలుబు లక్షణాలు, వాటి వల్ల వారు బాధపడిన తీరు కూడా తీవ్రంగానే ఉన్నాయట.

 

అబ్బా...జలుబుతో బాధపడటం కూడా ఓ బాధేనా! ఇదీ ఓ పరిశోధననే అనుకోవడానికి వీల్లేదు. జలుబు వల్ల డబ్బుకి డబ్బు, సమయానికి సమయం వృధా అయిపోతుంటాయి. పైగా ఒంటరతనంలో ప్రతి చిన్న ఆరోగ్య, మానసిక సమస్యా అమితంగా వేధిస్తుందనడానికి ఇదో రుజువు. ఉదాహరణకు ఒంటరితనంతో బాధపడేవారిలో ఒత్తిడి కూడా మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చునట. ఆ ఒత్తిడే వారి శరీరాన్ని కూడా లోబరుచుకుని కేన్సర్ వంటి అనారోగ్యాలకి దారితీస్తుంది.

 

ఒంటరితనంటే ఎవరూ లేకపోవడమే కాదు.... తన చుట్టూ వందమంది ఉన్నా కూడా ఎవరితోనూ మనసుని పంచుకోలేకపోవడం. ఇది నిజంగా ఓ మానసిక సమస్యే! దానికి పరిష్కారం వెతుక్కోవాల్సిందే. వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగుల శారీరిక లక్షణాలకి మందులు ఇచ్చేసి ఊరుకోకుండా... వీలైతే వారి మానసిక పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైద్యం ఓ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో అంత శ్రద్ధ ఎవరికన్నా ఉంటుందంటారా!

- నిర్జర.