ఆ రెండు స్థానాల్లో టీడీపీ.. తెరాసకు పెద్ద తలనొప్పిగా మారిందా?

 

తెలంగాణలో టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మొదటినుంచి పట్టుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని టీడీపీనే కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశముంది.. కానీ పార్టీలో అంతర్గత వర్గ పోరు కారణంగా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికల తరువాత పార్టీలోని కొందరు నేతలు తెరాసలో చేరారు. దీంతో ఇప్పుడు వర్గపోరు లేదు. అదీకాకుండా ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది. దీంతో ఖమ్మంలో టీడీపీ బలం రెట్టింపు అవుతుంది. నిజానికి 2014 ఎన్నికల తరువాత సీనియర్ నాయకులు కొందరు పార్టీని వీడడంతో ఖమ్మంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విషయం ఈ మధ్య బాలకృష్ణ ఖమ్మం పర్యటన సందర్భంగా స్పష్టమైంది. బాలకృష్ణ మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించగా.. స్వచ్చంధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పసుపుమయం చేసారు. దీంతో టీడీపీ ఖమ్మంలో ఎంత బలంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం కూడా తోడవడంతో.. ఖమ్మం పార్లమెంట్ కి మహాకూటమి అభ్యర్థి బరిలోకి దిగితే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రధాన దృష్టి ఉంది. అవే ఖమ్మం అసెంబ్లీ మరియు సత్తుపల్లి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్, టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై ఐదువేల మెజారిటీతో గెలుపొందారు. అయితే తరువాత వీరిద్దరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మల మంత్రి అయ్యారు. తరువాత పాలేరులో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక ఖమ్మం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ నే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని తెరాస పట్టుదలగా ఉంది. అజయ్ తో పాటు తుమ్మల ఖమ్మం అసెంబ్లీని సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఖమ్మంలో తెరాస గెలుపు సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. ఆ ఎన్నికల్లో తెరాస 7 శాతం ఓట్లకే పరిమితమైంది. తరువాత ఇద్దరు నేతల చేరికతో తెరాస బలం కాస్త పెరిగినప్పటికీ.. ఖమ్మంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఇంకా బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం.. అదీగాక మహాకూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయం అవ్వడంతో తెరాసకు తలనొప్పి మొదలైంది. బలమైన కేడరున్న పార్టీలు ఏకమవ్వడం, బలమైన ప్రత్యర్థి బరిలోకి దిగుతుండడంతో తెరాసకు ఓటమి భయం మొదలైంది.

సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసిన దయానంద్ రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక తెరాస అభ్యర్థి పిడమర్తి రవి కేవలం ఆరు వేల ఓట్లే సాధించారు. తరువాత వైసీపీ అభ్యర్థి దయానంద్ తెరాసలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆయనే అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తెరాస అనూహ్యంగా పిడమర్తి రవినే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగ భగ్గుమంది. ఇదే సండ్రకు కలిసి రానుంది. ఒకవైపు కాంగ్రెస్ ఓటుబ్యాంకు బలం తోడైంది.. మరోవైపు తెరాసలో అసంతృత్తి సెగ. దీంతో మళ్ళీ సండ్రనే విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తుమ్మల మాత్రం సత్తుపల్లిని బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా తెరాస జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత నియోజకవర్గం.. అదీగాక ఆయన గతంలో టీడీపీని తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు, అనుభవంతో సండ్ర జోరుకి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తుమ్మల ఆశలు ఫలించేలా లేవు. మొత్తానికి టీడీపీ బరిలోకి దిగుతున్న ఖమ్మం అసెంబ్లీ, సత్తుపల్లి అసెంబ్లీ సీట్లు తుమ్మల, తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.