తండ్రి పోలికలతో పుడితే ఆరోగ్యం


ఇంట్లో పసిపిల్లలు ఉంటే చాలు...  వాళ్లని చూడ్డానికి వచ్చిన వాళ్లందరినీ ఒకే ఒక్క ప్రశ్నతో చావగొట్టేస్తాం. ఆ ప్రశ్నేమిటో ఈపాటికి తోచే ఉంటుంది కదా! అదేనండీ... ‘పిల్లవాడిది తండ్రి పోలికా తల్లి పోలికా?’ అని. పిల్లలు నా పోలిక అంటే నా పోలిక అంటూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే... పిల్లలు కనుక తండ్రి పోలికతో ఉంటే వాళ్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదట!

అమెరికాలో బింగామ్టన్‌ అనే ఓ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వీళ్లు ఓ పరిశోధన నిర్వహించారు ఇందుకోసం పదీ, వందా కాదు ఏకంగా 715 కుటుంబాలని ఎన్నుకున్నారు. ఈ పరిశోధన కోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే కుటుంబాలని ఎంచుకున్నారు. తండ్రి తన కుటుంబాన్ని చూసేందుకు ఎన్నిసార్లు తిరిగివస్తున్నాడో తెలుసుకునేందుకే అలాంటి కుటుంబాలను ఎంచుకున్నారన్నమాట.

పిల్లలు తండ్రి పోలికతో ఉంటే... వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దాంతో వాళ్లతో పాటు ఎక్కువ రోజులు గడిపేందుకు ఇష్టపడతాడట. ఇలాంటి తండ్రులు నెలలో నెలలో దాదాపు రెండున్నర రోజుల పాటు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లు తేలింది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం అంటే, వాళ్ల మంచిచెడులను కూడా జాగ్రత్తగా గమనించుకోవడమే కదా! అందుకే ఏడాది గడిచేసరికి తండ్రి పోలికలు ఉన్న పిల్లలు మరింత ఆరోగ్యంగా కనిపించారట.

-Niranjan