తండ్రిగా ఉంటే బోలెడు ఆరోగ్యమట!

 

ఇంట్లో చిన్న పిల్లల అల్లరితో చిరాకుపడని తండ్రులు ఉండరు. పని చేసుకోనివ్వకుండా, పడుకోనివ్వకుండా కాళ్లకి అడ్డం పడిపోతూ ఉండే పిల్లలను విసుక్కోని నాన్నాలు ఉండరు. కానీ పైపైకి ఇలా విసుక్కుంటున్నా, జీవితంలోని ఈ పార్శ్యం ఎంతో అమూల్యం అని వారికి తెలుసు. అయితే వారికి కూడా తెలియకుండా జరిగే ప్రక్రియ ఏమిటంటే.... పిల్లల వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటం!

ఒత్తిడి మాయం!

పిల్లల పట్ల అనుబంధం కలిగిన తండ్రులలో ఒత్తిడి శాతం చాలా తక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు పరిశోధకులు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ వంటి సంస్థలు ఎన్నో వందలాది కుటుంబాల మీద పరిశోధనలు చేసిన తరువాతే తేల్చిన అంశం ఇది. ఇలా ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, అజీర్ణం, డిప్రెషన్, ఛాతీనొప్పి వంటి లక్షణాలు కూడా దూరంగా ఉండటాన్ని గమనించారు.

ఆఫీసులో ఆరోగ్యం

ఒక పరిశోధన ప్రకారం పిల్లలు ఉన్న తండ్రులు తమ తోటివారికంటే 22 శాతం ఎక్కువ బోనస్‌ను సంపాదించగలుగుతున్నారు. పైకి కాస్త చిత్రంగా కనిపిస్తున్నా దీనికి కారణం లేకపోలేదంటున్నారు పరిశోధకులు. పిల్లలు ఉన్న తండ్రులకి సర్దుకుపోయే లక్షణం ఉంటుందనీ, పైగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడంలాంటి దూకుడు తక్కువగా ఉంటుందనీ అంటున్నారు. బహుశా ఈ కారణాలన్నింటివల్లా కావచ్చు... తండ్రులలో ఉద్యోగ తృప్తి (Job Satisfaction) కూడా ఎక్కువగా ఉంటుందట.

చెడు అలవాట్లకు దూరం

కుర్రతనంలో ఉండేవారు సిగిరెట్లు, మందు... ఇంకా మాట్లాడితే మాదకద్రవ్యాలు అంటూ విచ్చలవిడిగా ప్రవర్తించడం మనకి తెలుసు. కానీ అదే కుర్రకారు పెద్దై తండ్రి బాధ్యతను చేపట్టిన తరువాత వారిలోని దురలవాట్లు చాలావరకూ దూరం కావడమో, మోతాదు తగ్గిపోవడమో జరుగుతుందట. బాధ్యత తెలియడం వల్లో, తన దురలవాట్ల వల్ల పిల్లలు పాడు కాకూడదన్న తపన వల్లో ఇలాంటి మార్పు వస్తుందంటున్నారు విశ్లేషకులు.

పక్కచూపులు చూడరు

మగవారిని పునరుత్పత్తికి ప్రోత్సహించే ముఖ్యమైన హార్మోను- టెస్టోస్టెరోన్‌! తండ్రి అయ్యిన తరువాత ఈ టెస్టోస్టెరోను శాతం చాలా సాధారణ స్థితికి చేరుకోవడాన్ని గమనించారు. దీని వల్ల మగవారిలో చెడుతిరుగుళ్లు తిరగడం, వివాహేతర సంబంధాలకు పాల్పడటం వంటి ప్రవర్తన తగ్గుతుందట.

శుభ్రమైన తిండి

తండ్రి హోదా దక్కిన తరువాత ఏది పడితే అది ఎడాపెడా తినేసే అలవాటు తగ్గిపోతుందట. ఆరోగ్యం కోసమో లేకపోతే పిల్లలకు ఆదర్శంగా ఉండేందుకో చిరుతిళ్ల కంటే పోషక పదార్థాల మీదే ఎక్కువగా దృష్టిని సారిస్తారట. తండ్రిగా మోయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు కూడా ఆహారం మీద శ్రద్ధ పెరుగుతూ ఉండవచ్చు. ఇలా పోషాకాహారాన్ని తీసుకోవడం వల్ల కాస్త ఊబకాయం వచ్చినట్లు కనిపించినా, మనుషులు మాత్రం మునుపటి కంటే ఆరోగ్యంగా మారతారని తేలుస్తున్నాయి పరిశోదనలు.

ఇంకా దాంపత్య జీవితం మెరుగుపడం, పనివేళలు పెరగడం, ఆత్మవిశ్వాసంలో మార్పు రావడం, రోజువారీ సమస్యలను ఎదుర్కొనడంలో మరింత నైపుణ్యాన్ని సాధించడం.... ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ తండ్రిగా బాధ్యతను సక్రమంగా పోషించడంలో చాలా లాభాలే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. అంటే పిల్లలకు ఏడాదిలో ఒక్క రోజే ఫాదర్స్‌ డే అయితే, తండ్రులకు ఏడాది పొడవునా ఉన్న రోజులన్నీ తమవే అన్నమాట!

- నిర్జర.