తండ్రికి కూతురంటేనే ఇష్టం. ఎందుకంటే...

 

తండ్రికి కూతురి మీదా, తల్లికి కొడుకు మీదా ఎక్కువ ప్రేమ ఉంటుందని ఓ నమ్మకం. అదంతా ఒట్టి ట్రాష్‌ అని కొట్టి పారేసేవాళ్లూ లేకపోలేదు. అసలు ఈ నమ్మకంలో నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు అమెరికన్‌ సైకాలజిస్టులు. దానికోసం ఓ పరిశోధన చేశారు. అ పరిశోధన ఏమిటో, అందులో తేలిన నిజాలు ఏమిటో మీరే చూడండి!

ఈ పరిశోధన కోసం ఓ 52 కుటుంబాలని ఎంచుకున్నారు. అందులో కొన్ని ఫ్యామిలీలలో ఆడపిల్లలు ఉంటే, మరికొన్ని కుటుంబాలలో మగపిల్లలు ఉన్నారు. ఈ కుటుంబాలలోని పెద్దలకి ఓ చిన్న రికార్డర్‌ని ఇచ్చారు. ఆ రికార్డరుని బెల్టుకి తగిలించుకోమని చెప్పారు. ఆ రికార్డరు ప్రతి తొమ్మిది నిమిషాలకి ఓసారి ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. ఓ యాభై సెకన్ల పాటు చుట్టూ ఉన్న శబ్దాలను రికార్డు చేస్తుంది.

ఇలా రికార్డయిన శబ్దాలని ఎనలైజ్ చేసిన పరిశోధకుల మతి పోయినంత పనయ్యింది. తండ్రులు ఆడపిల్లలతో మాట్లాడే విధానానికీ, మగపిల్లలతో మాట్లాడే విధానానికీ చాలా తేడా కనిపించింది. మగపిల్లలతో వాళ్లు చాలా రఫ్‌గా మాట్లాడారట. అంతేకాదు! వాటిలో సాధించాలి, ప్రయత్నించాలి, ముందుండాలి లాంటి సక్సెస్‌కి సంబంధించిన పదాలే కనిపించాయి. ఆడపిల్లల విషయంలో అలా కాదు! ఎక్కువ, తక్కువ, అందరూ.... ఇలా అనాలసిస్‌కి సంబంధించిన శబ్దాలే వినిపించాయి.

కేవలం మాట్లాడే పదాలే కాదు వారి ప్రవర్తన అంతా డిఫరెంట్‌గా కనిపించింది. ఆడపిల్లల దగ్గర తండ్రులు పాటలు పాడటానికైనా, తమ బాధని పంచుకోవడానికైనా సిగ్గుపడలేదు. అలాగే ఆడపిల్లలు ఏడ్చిన వెంటనే వాళ్లని దగ్గరకి తీసుకునేందుకు కూడా తండ్రులు సిద్ధంగా ఉన్నారు.

మన బ్రెయిన్‌ పనిచేసే తీరులోనే ఈ తేడా ఉందని అంటున్నారు పరిశోధకులు. మన జెనెటిక్స్‌లో భాగంగా ఆడపిల్లలతో ఒకలా, మగపిల్లలతో ఒకలాగా ప్రవర్తించేలా ఒక సిస్టం ఏర్పడిపోయిందట. ఆడపిల్లల స్వభావాన్ని బట్టి, సొసైటీలో వాళ్లతో ప్రవర్తించాల్సిన తీరుని బట్టి, మనకి తెలియకుండానే ఇలాంటి పద్ధతులు ఏర్పడ్డాయన్నమాట. అందుకే ఆడపిల్లలతో సున్నితంగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తే... మగపిల్లలతో రఫ్‌ అండ్‌ టఫ్‌గా ప్రవర్తిస్తున్నారట తండ్రులు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మగపిల్లలతో మరీ మోటుగా ప్రవర్తిచవద్దని సూచిస్తున్నారు.

-Niranjan