యవ్వనంగా ఉండాలన్నా, షుగర్ తగ్గాలన్నా- ఉపవాసమే మందు!

 

డయాబెటిస్ అనగానే ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ భారతదేశమే గుర్తుకువస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ రోగులు ఉన్న దేశంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో చక్కెర వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య ఆరుకోట్లకి పైమాటే. మరో పదిహేనేళ్లు పోతే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే! ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. అందుకని ఇది చిన్నతనంలోనే దాడిచేసే ప్రమాదం ఎక్కువ. ఈ తరహా డయాబెటిస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తిలోనే లోపం ఉంటుంది. దానివల్ల మన రక్తంలోకి చేరుకున్న చక్కెర నిల్వలను శక్తిగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇక టైప్ 2 డయాబెటిస్ మన తరచూ వినే తరహా లోపం. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ, దానిని శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ రెండు రకాల డయాబెటిస్లకు ఓ చికిత్సను కనుగొన్నామంటున్నారు శాస్త్రవేత్తలు.

 

కాలిఫోర్నియాలోని Leonard Davis School of Gerontologyకి చెందిన పరిశోధకులు ఈ చికిత్సను రూపొందించారు. ఇందుకోసం వారు ప్రయోగశాలలోని ఎలుకలకి పదిశాతం ఆహారాన్ని మాత్రమే అందించారు. ఇలా ఓ నాలుగురోజులు చేసిన తరువాత మరో పదిరోజుల పాటు, వాటి ఇష్టారాజ్యంగా ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఓ మూడు దఫాలుగా ఆహారంలో మార్పులు చేయగానే ఎలుకలలో అద్భుతమైన మార్పులు కనిపించాయట.

 

ఎప్పుడైతే శరీరానికి తగినంత ఆహారం లభించలేదో... అప్పుడు అందులోని కణాలు నిశ్చలమైన స్థితికి (stand by) చేరుకున్నాయి. కొద్ది రోజుల తరువాత తిరిగి తగినంత ఆహారాన్ని అందుకోగానే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సర్దుకోవడాన్ని గమనించారు. ఉదాహరణకు డయాబెటిస్ టైప్ 1 వ్యాధిలో బీటా సెల్స్ అనే తరహా కణాలు తగినంత లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. కానీ ఉపవాసం చేయించిన ఎలుకలలో ఈ బీటా కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వడాన్ని గమనించారు. అంతేకాదు! డయాబెటిస్ టైప్ 2 బారిన పడ్డ ఎలుకలలో కూడా చక్కెర వ్యాధి తిరుగుముఖం పట్టినట్లు తేలింది. కణాలకు తమని తాము బాగుపరచుకునే ఈ అవకాశం దక్కడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు... రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. అంతేకాదు! వయసుతో వచ్చే మార్పులని నివారించడంలోనూ, కేన్సర్ ఏర్పడే పరిస్థితులను నిరోధించడంలోనూ కూడా ఈ తరహా ఉపవాసాలు లాభిస్తాయని చెబుతున్నారు. అందుకనే మనుషుల మీద కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతిని కోరుతున్నారు.

 

విచిత్రం ఏమిటంటే... ఏ ఎలుకల మీదా ప్రయోగం చేయకుండా, ఏ ప్రభుత్వ అనుమతీ లేకుండానే మన దేశంలోని ప్రకృతి వైద్యులు ఈ తరహా ఉపవాసాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా కుదరకపోయినా కనీసం ఏకాదశి, శివరాత్రి వంటి విశేషమైన రోజులలో అయినా ఉపవాసాన్ని పాటించమని మొత్తుకుంటున్నారు. కానీ మనం వింటేనా! అందుకే ఉపవాసానికీ, ప్రకృతివైద్యానికీ పేరొందిన మన దేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు.

(షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపవాసం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)


 

- నిర్జర.