ఫేక్ పోస్టులు..ఫేక్ సర్వేలు.. కుళ్లు జోకులు! గతి తప్పిన సోషల్ క్యాంపెయిన్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వారం రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ప్రచారంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. గ్రేటర్ ఎన్నికల్లో సోషల్ మీడియా  కీ రోల్ పోషిస్తోంది. అన్ని పార్టీలు ఆన్  లైన్ ప్రచారం కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియా ప్రచారం గ్రేటర్ సమరంలో హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. అన్ లైన్ లో ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. తమ పార్టీకి కలిసొచ్చేలా, ప్రత్యర్థి పార్టీలకు డ్యామేజీ కలిగేలా ఫేక్ ఆడియో కాల్స్, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సర్వేలంటూ ఫేక్ సర్వేలను క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 

 

గ్రేటర్ ఎన్నికలపై సర్వే అంటూ ఫేక్ సర్వేలు బయటికి వస్తున్నాయి. ఒకే సర్వే సంస్థ పేరుతోనూ డిఫరెంట్ ఫలితాలు ఉండే సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాణక్య సంస్థ పేరుతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 90-96, ఎంఐఎం 3035,  టీఆర్ఎస్ 24-29, కాంగ్రెస్ కు 4-6 సీట్లు వస్తాయని ఉన్న సర్వేలను బీజేపీ కేడర్ వైరల్ చేస్తోంది. టీఆర్ఎస్ కు 96- 106, ఎంఐఎంకు 40-45, కాంగ్రెస్, బీజేపీలకు 1-2 డివిజన్లు వస్తాయని సూచించే సర్వే మ్యాపులను గులాబీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు రాబోతున్నాయంటూ అదే చాణక్య పేరుతో హస్తం అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో, ఏది అసత్యమో తెలియక గ్రేటర్ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. 

 

ఫేక్ ఆడియో కాల్స్, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా టీఆర్ఎస్ అనుకూలురు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత నుంచి తప్పించారంటూ ఓ న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సంజయే మీడియా ముందుకు వచ్చి అది ఫేక్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. తమ పేరుతో అసత్య ప్రచారం జరుగుతుందని సదరు ఛానెల్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా.. రాజా సింగ్  ట్వీట్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దానిపైనా రాజాసింగ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఉత్తమ్ తో ఆమె సమావేశమయ్యారని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ లో చేరారని కూడా కొందరు పోస్టులు పెట్టి వైరల్ చేశారు. 

 

గ్రేటర్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. తమ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు, విషపురాతలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. నేతల అలవాట్లు, ఆకారాలపై విద్వేషపు పోస్టులు పెడుతున్నారు. గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. ఇలా  ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు.  ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు. 

 

కొత్త ఓటర్లే లక్ష్యంగా ప్రైవేటు ఆర్మీల హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

 

గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్‌ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలకు అనుకూలంగా వారి అధికారిక సోషల్ వింగ్ లు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి.కొందరు అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు నడిపిస్తున్నారు. వారంతా తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా  పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయమని, కాని ఇలా విద్వేషాలకు దిగడం ప్రమాదమంటున్నారు పోలీసులు.