కేటుగాడు.. కోట్లు కొట్టేసాడు.

 

'మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు' అన్నట్టుగా.. ఓ వ్యక్తి ఉన్నాడు.. మెడలో భారీ గోల్డ్ చైన్, చేతికి బ్రాస్ లెట్, అన్ని వేళ్లకు ఉంగరాలు, వంటిమీద ఖద్దరు డ్రెస్, తిరగడానికి ఖరీదైన కార్లు.. అబ్బో, అతను పైకి చూడటానికి అంబానీలా కనిపిస్తాడు.. కానీ లోపల ఒరిజినల్ క్యారక్టర్ పెద్ద మోసగాడు, కేటుగాడు.. అతనే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్‌.. ఒకప్పుడు గ్రానైట్‌ కంపెనీల వద్ద లారీ డ్రైవర్‌ గా పనిచేసిన ఇతను.. తరువాత గ్రానైట్ కంపెనీ కొనే స్థాయికి ఎదిగాడు.. అతను ఆ స్థాయికి చేరడానికి కష్టాన్ని నమ్ముకోలేదు మోసాన్ని నమ్ముకున్నాడు.. డ్రైవర్ గా పనిచేసేటప్పుడు లారీలో గ్రానైట్‌ లోడుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో పరిచయం ఏర్పడింది.. ఆ ముఠాలతో కలిసి జేసీబీలను కాజేసి అమ్మడం చేసేవాడు.. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్‌టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్‌ పొందేవాడు.. ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు.. తర్వాతర్వాత ఆ మోసాన్ని కార్లు, జీపులకు కూడా విస్తరించాడు.. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయల సొమ్ము వెనుకేసుకొన్నాడు.. ఏడాది తిరిగేసరికి ఒక గ్రానైట్‌ కంపెనీనే కొనేసే స్థాయికి ఎదిగిపోయాడు.. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఒక కంపెనీ ఏర్పాటుచేశాడు.. ఒంగోలులో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కూడా కట్టాడు.

మరి చంద్రశేఖర్ కి కొన్నాళ్ళకు ఇలా వాహనాలు కొట్టేయడం అమ్మడం బోర్ కొట్టిందేమో.. కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు.. ముందుగా షోరూమ్ కు వెళ్లి ఓ ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తాడు.. ఆ తరువాత ఆ వాహనంపై ఏదో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు.. అయితే దొంగ పత్రాల సృష్టి అనుభవంతో దానిపై అప్పు తీర్చకుండానే, అంతా డబ్బు కట్టేసినట్టు ఓ నకిలీ ఎన్‌వోసీ సృష్టిస్తాడు.. ఆ పత్రాలు ఆర్‌టీఏ కార్యాలయంలో చూపించి, దానికి క్లియరెన్స్‌ పొందుతాడు.. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్‌ సంస్థను సంప్రదించి, అక్కడ నుంచి మరోసారి రుణం పొందుతాడు.. ఇలా మూడు నాలుగు సంస్థల నుండి రుణాలు పొందుతాడు.. అతనికి కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతుంది.. ఇదంతా ఓ సినిమా కథని తలపిస్తుంది కదా.. సముద్రమంతా ఈది ఇంటిముందు మురికి కాలువలో పడి చనిపోయినట్టు.. చంద్రశేఖర్ కూడా మోసాలు చేస్తూ కోట్లు సంపాదించి, చివరికి చిక్కాడు.. చంద్రశేఖర్ ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి 30 లక్షలకు రెండు ఇన్నోవా కార్లను అమ్మాడు.. అమ్మేటప్పుడు ఈ వాహనాలకు రిజిష్ట్రేషన్‌ తో సహా అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయని చెప్పాడు.. అయితే ఎన్నిరోజులైనా క్లియరెన్స్‌ డాక్యుమెంట్లు ఇవ్వకపోతుండటంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది.. దీంతో నేరుగా ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అనుకోకుండా ఇతగాడు చేస్తున్న మోసం బయటపడింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు.