ఆధార్ ఉంటేనే ఫేస్‌బుక్ లాగిన్..?

ఆధార్ అంటూ మన దేశంలోకి ప్రవేశించిన ఓ పన్నెండు అంకెల నంబర్ ఇప్పుడు మన జీవితాలతో విడదీయరాని అనుబంధం వేసుకుంటోంది. బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్లు, పాన్‌కార్డు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఇప్పుడు ఎలాంటి పని జరగాలన్నా ఆధార్ కార్డ్ ఉండాల్సింది.. ఈ జాబితాలోకి ఎన్నో సేవలు వస్తూ.. ఆధార్‌ మిమ్మల్ని వదలదు అనే సంకేతాలను ఇస్తోంది. అయితే ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలోని మనుషులను కలుపుతున్న ఫేస్‌బుక్ వాడాలన్నా ఇక మీదట ఆధార్ ఉండాల్సిందేనట.

 

ఫేస్‌బుక్ అనేది ఒక మహా సముద్రం.. వ్యక్తిగత అవసరాలకో.. లేక మరేదైనా కారణం చేతనో.. ప్రతి ఒక్కరికి ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలోనే ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఒక్క మనదేశంలోనే దాదాపుగా 24.1 కోట్ల నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్‌బుక్ గుర్తించింది.

 

వీటిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఫేస్‌బుక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అకౌంట్లను వాడేవారందరూ తమ అసలైన పేర్లనే వాడేందుకు వీలుగా ఫేస్‌బుక్ ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే.. నేమ్ యాజ్ పర్ ఆధార్.. ఫేస్‌బుక్ వాడుతున్నవారు.. కొత్తగా ఫేస్‌బుక్ అకౌంట్ తెరవాలనుకునేవారు లాగిన్ అయ్యే సమయంలో ఒక కాలమ్ కనిపిస్తుంది.. ఇక్కడ ఆధార్‌ కార్డ్‌లో ఉన్న విధంగా పేరు ఇవ్వాలి.. తద్వారా నకిలీల బెడద తగ్గడంతో పాటు మీ స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలుగుతారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను మొబైల్ ద్వారా ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న కొంతమంది యూజర్ల ద్వారా పరీక్షిస్తున్నారు. అయితే ఈ ఆప్షన్‌ను పాటించాల‌నుకున్న వారు పాటించుకోవ‌చ్చు.. లేదంటే మామూలుగా ఇష్టం వ‌చ్చిన పేరుతో ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.