పని మధ్యలో ఫేస్‌బుక్‌ చూస్తున్నారా!

సోషల్‌ మీడియా ఒక వ్యసనం. కాకపోతే అది హద్దుల్లో ఉన్నంతవరకూ చాలా ఉపయోగం అనుకుంటూ ఉంటాము. అందుకే ఎంత పనిలో ఉన్నా మధ్యమధ్యలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్ లాంటి అకౌంట్లను పలకరిస్తుంటాం. ఇలా పని మధ్యలో వాటిని చూడటం వల్ల మనం రిలాక్స్ అవుతామన్నది మన ఉద్దేశం. ఇందులో నిజమెంత?

 

ఒక సమయంలో ఒకే పని మీదే దృష్టి పెట్టినప్పుడు, మన మెదడు ఏకాగ్రతతో పనిచేస్తుంది. అలాకాకుండా ఏకకాలంలో నాలుగు రకాల పనుల మీదా దృష్టి పెట్టినప్పుడు దాదాపు 40 శాతం తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్నే మరోసారి రుజువుచేసే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ నాలుగు సినిమాలని 50 సెకన్ల పాటు ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని కలగాపులగం చేసి జనాలకి చూపించారు. ఇలా చూస్తున్న సమయంలో వారి మెదడు ఎలా పనిచేస్తుందో స్కాన్ చేశారు.

 

పరిశోధనలో రెండో దశలో సినిమాలని మరీ 50 సెకన్ల పాటు కాకుండా కనీసం 6.5 నిమిషాల నిడివి ఉండేట్లు కత్తిరించారు. వీటిని కూడా కలగాపులగం చేసి జనాలకి చూపించారు. 50 సెకన్ల ముక్కలు చూసినప్పటికంటే 6.5 నిమిషాల వీడియోలను చూసినప్పుడు ప్రేక్షకుల మెదడు సజావుగా పనిచేస్తున్నట్లు తేలింది. మెదడులో cerebellum వంటి భాగాలు ముక్కలు ముక్కలుగా చూసిన విషయాలను ఒకే ప్రవాహంలా (sequence) అల్లుకునే ప్రయత్నం చేస్తాయి. ఆ సీక్వెన్స్‌ని మాటిమాటికీ గజిబిజి చేస్తుంటే మెదడు మీద భారం తప్పదు.

 

సాధారణంగా మనం నాలుగు రకాల పనులని ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. దీని వల్ల సమయం కలిసి వచ్చినట్లు కనిపించిన్పటికీ... ఇలాంటి మల్టీ టాస్కింగ్‌ వల్ల నిజానికి పనులు మరింత ఆలస్యంగానూ, అసంపూర్ణంగానూ సాగుతాయట. ఈ సూత్రం సోషల్‌ మీడియాకు మరింత బాగా వర్తిస్తుంది. ఒకసారి ఏ ఫేస్‌బుక్కో ఓపెన్‌ చేశామనుకోండి.. అందులో ఒకరు ఏదో వార్తని పోస్ట్‌ చేస్తారు, ఇంకొకరు ఆట ఆడమని పిలుస్తారు, మరొకరు ఏదో పాటని అప్‌లోడ్‌ చేస్తారు... ఇలా రకరకాల పోస్టులు చూసుకుంటే వెళ్లేకొద్దీ మెదడు గజిబిజిగా మారిపోతుంది. పైగా మనం చేసే పని ఆపి మరి ఈ పోస్టులు చూడటం మొదలుపెడితే... అసలు పని మీద ఏకాగ్రత చెదిరిపోతుంది.

 

- నిర్జర.