కళ్లతో చెలగాటం వద్దు

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న మాట పుట్టినప్పటి నుంచి వింటున్నదే! కాకపోతే ఏదో ఉపద్రవం ముంచుకువచ్చేంతవరకూ వాటి విలువ మనకి తెలియదు. నిజానికి లోకానికీ మనకీ వారధిగా నిలిచే ఆ కంటిచూపుని కాపాడుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. మనకి అందుబాటులో ఉండే ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉంటే... కళ్లు మన కడవరకూ తోడుగా నిలుస్తాయి.

 

 

పిల్లలకి కంటి పరీక్ష

మన దేశంలో చాలామంది కంటి పరీక్షలని చేయించుకునేందుకు బద్ధకిస్తూ ఉంటారు. తమ పిల్లల విషయంలో కూడా ఇదే అశ్రద్ధ చూపడం ఆశ్చర్యకరం. పిల్లలు తమలో ఏర్పడిన దృష్టిలోపాలని గ్రహించలేకపోవడం వల్లనో, గ్రహించినా పెద్దలకు భయపడి చెప్పలేకపోవడం వల్లనో... చత్వారం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకని పెద్దలే పూనుకొని రెండేళ్లకి ఓసారి పిల్లలను కంటి వైద్యుడి దగ్గరకి వెళ్లి పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇక పెద్దలు కూడా తమకి 60 ఏళ్లు వచ్చేవరకూ ప్రతి రెండేళ్లకి ఓసారి, ఆ తరువాత ఏడాదికి ఓసారి కంటి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.

 

 

కంప్యూటర్‌తో 20-20-20

ఈకాలంలో ఇంచుమించుగా అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్‌ ముందే సాగుతున్నాయి. కంప్యూటర్ స్క్రీన్‌ వంక తదేకంగా చూడటంతో అసలు మనం కళ్లని ఆర్పడం కూడా మర్చిపోతూ ఉంటాము. దానివల్ల కళ్లు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కంప్యూటర్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్ మరీ ఎక్కువగా ఉండకూడదనీ, స్క్రీన్‌ తగినంత దూరంలో ఉండాలనీ, మధ్యమధ్యలో కళ్లని ఆర్పుతూ ఉండాలనీ చెబుతున్నారు. దీనికి తోడుగా ప్రతి 20 నిమిషాలకి ఓసారి కంప్యూటర్ నుంచి దృష్టి మరల్చి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను ఓ 20 సెకన్ల పాటు చూడటం వల్ల... కంటి మీద ఒత్తిడి తగ్గుతుందని సూచిస్తున్నారు.

 

 

సరైన ఆహారం

కంటి ఆరోగ్యం అనగానే అందరూ క్యారెట్ల గురించే మాట్లాడతారు. నిజానికి పోషకాలను అందించే ప్రతి ఆహారమూ కంటికి మంచిదే. ఎందుకంటే విటమిన్‌ Aతో పాటుగా విటమిన్‌ C, విటమిన్‌ E, జింక్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు కంటికి అవసరమవుతాయి. ఇందుకోసం ఆకుకూరలు, నారింజ వంటి పండ్లు కంటికి బలాన్ని చేకూరుస్తాయి.

 

 

సరైన జాగ్రత్తలు

చాలావరకూ కంటి ప్రమాదాలు అజాగ్రత్త వల్లే జరుగుతాయి. క్రికెట్‌ వంటి ఆటలు ఆడేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కళ్లద్దాలు ధరించకపోవడం, దీపావళి సామాన్లు కాల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం... అన్నింటికీ మించి కంటికి ఏదన్నా సమస్య వస్తే వెంటనే వైద్యుని సంప్రదించపోవడం వంటి అజాగ్రత్తల వల్ల సున్నితమైన కంటి భాగాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

 

 

పొగత్రాగడం

పొగ త్రాగేవారిలో నానారకాల ఆరోగ్య సమస్యలతో పాటుగా కంటిచూపు కూడా దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా కంటిలోని రెటినాని దెబ్బతీసే age-related macular degeneration (AMD) అనే వ్యాధి పొగత్రాగేవారిని వేధించే అవకాశం ఉందని తేలింది. ఇక పొగతాగే అలవాటుకీ శుక్లాలకీ కూడా సంబంధం ఉందనే పరిశోధనలు కూడా వెలువడ్డాయి.

(ఇవాళ World Sight Day సందర్భంగా)

 

- నిర్జర.