ఇంట్లోనే ఉంటే కంటి సమస్యలు


ఇప్పటి పిల్లల తీరు మారిపోతోంది. తల్లిదండ్రులకు సమయం లేకనో, ఆడుకునేందుకు స్థలమే లేకనో... పిల్లలు ఇప్పుడు నాలుగు గోడల మధ్యే గడిపేస్తున్నారు. అయితే బడి లేకపోతే ఇల్లు- ఈ రెండింటిలోనే వారి బాల్యం దాటిపోతోంది. కానీ ఈ పరిస్థితి వారికేమంత మేలు చేకూర్చదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అదేపనిగా ఇంట్లో ఉండే పిల్లలు హస్వదృష్టి (myopia) సమస్యలని ఎదుర్కొంటారని చెబుతున్నారు. అదెలాగంటే....

 

ప్రత్యేకమైన వ్యవస్థ

 

కంటి ముందర ఉన్న దృశ్యాన్ని రెటీనా మీద నిలపడానికి కంట్లో ఒక ప్రత్యేక కణం పనిచేస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు. అయితే అది ఏ కణం అన్నది నిర్దిష్టంగా కనిపెట్టలేకపోయేవారు. అమెరికాకు చెందిన పరిశోధకులు ఇప్పుడు ఆ కణం ఏమిటన్నది కనిపెట్టేశారు. ఎలుకల కళ్ల మీద రకరకాల కాంతులను ప్రసరిస్తూ, వాటి రెటీనాలలోని కణాల పనితీరుని పసిగట్టారు. సదరు కణానికి ‘ON Delayed’ అని పేరు పెట్టారు.

 

ఎదుగుదలకు సైతం

 

‘ON Delayed’ కణజాలం కేవలం దృశ్యాన్ని సరఫరా చేయడంలోనే కాదు... కంటి ఎదుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని తేలింది. ఒక వయసు వచ్చేనాటికి మన కళ్లు సంపూర్ణంగా ఎదిగేందుకు ఈ కణాలు తోడ్పడతాయి. అయితే ఇక్కడే అసలు సమస్య కనిపించింది. ఇళ్లలో కృత్రిమంగా ఉండే వెలుతురు కళ్ల మీద చూపే ప్రభావం విభిన్నంగా ఉంటుంది. కాంతిలోని సప్తవర్ణాలు ఉంటాయని తెలిసిందే కదా! కృత్రిమ కాంతిలో వీటిలోని ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాఢత మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో ON Delayed కణజాలం పనితీరు మీద ప్రభావం పడుతోంది. అది కంటి ఎదుగుదలను ఎప్పుడు నిలిపివేయాలో కనిపెట్టలేకపోతోంది. ఫలితం! కన్ను అవసరమైన పరిమాణాన్ని మించి ఎదిగిపోతుంది. హస్వదృష్టి ఏర్పడుతుంది.

 

ఇదీ ఉపయోగం

 

మన శరీరంలో కన్ను ఒక సున్నితమైన, సంక్లిష్టమైన అవయవం. ఇందులో కనీసం 50 రకాల కణాలు కలిసి పనిచేస్తేనే ఒక దృశ్యం మన మెదడుని చేరుతుందని అంచనా! వాటిలో ఏఏ కణాలు ఏఏ పనులు చేస్తాయో కనుక తెలుసుకోగలిగితే... తత్సంబంధమైన కంటి సమస్యలను నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు హస్వదృష్టికి కారణం ON Delayed కణజాలం అని తేలిపోయింది కదా! దీంతో మున్ముందు చిన్నపాటి జన్యు చికిత్సను చేసి హస్వదృష్టి ఉన్నవారి కంటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఇంతేకాదు కణాల పనితీరులో లోపం వల్ల ఏర్పడే అంధత్వం వంటి తీవ్రమైన సమస్యలను సైతం సరిదిద్దవచ్చు.

 

భవిష్యత్తు సంగతేమో కానీ.... ప్రస్తుతానికి మాత్రం ఈ పరిశోధన వల్ల ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. పిల్లలను కోడిపిల్లల్లాగా అక్కడక్కడే ఉంచకుండా వారికి కాస్త గాలి, వెలుతురు తగిలేలా తిరగనివ్వాలని ఈ పరిశోధన సూచిస్తోంది.

- నిర్జర.