రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాక్సిన్ కొనవద్దు.. జాతీయ నిపుణుల కమిటీ

ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ లు చివరి దశ ట్రయల్స్ లో ఉండడంతో పాటు ఇప్పటికే రష్యా తాను కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన నేపథ్యంలో మన దేశం లో ఈ వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీల పై కేంద్రం దృష్టి పెట్టి.. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ నిన్న సమావేశమై వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ విధానం, నిర్వహణ తదితర అంశాలపై కీలక చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రపంచంలో ఏ దేశంలో వ్యాక్సిన్ విడుదలైనా రాష్ట్రాలు తమ సొంత మార్గాల ద్వారా దాన్ని తెప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

 

వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం, దాన్ని చేరవేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీని కోసం అందుబాటులోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై నీతి ఆయోగ్.. జాతీయ నిపుణుల బృందం నుండి వివరాలను అడిగి తెలుసుకుంది. మన దేశ పరిస్థితులకు అనువైన వ్యాక్సిన్ సేకరణ, దాని పంపిణీ ప్రక్రియను ట్రాక్ చేసేందుకు అందుబాటులోని వ్యవస్థలపైనా ఈ కమిటీ చర్చలు జరిపింది. వ్యాక్సిన్ ను సేకరించినప్పటి నుండి, దాన్ని ప్రజలకు చేరవేసేందుకు మార్గదర్శకాలపై దృష్టి పెట్టిన కమిటీ, దీని భద్రత, నిఘా తదితర విషయాల పైన చర్చించింది. దేశం మొత్తానికి కేంద్రం తరఫునే వ్యాక్సిన్ ఎంపికను చేయాలని రాష్ట్రాలు తమ మార్గాల్లో దీన్ని సమీకరించే ప్రయత్నాలు చేయవద్దని కమిటీ కోరింది.